Anakapalli: మునగపాకలో ₹50 లక్షల విలువైన అక్రమ మద్యం ధ్వంసం!
Anakapalli: మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన ₹50 లక్షల విలువైన 38,379 అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు.
Anakapalli: మునగపాకలో ₹50 లక్షల విలువైన అక్రమ మద్యం ధ్వంసం!
Anakapalli: సమాజంలో నేరాల రహిత వాతావరణాన్ని పెంపొందించడం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అందులో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు నమ్మకమైన సమాచారం, సమర్థవంతమైన నిఘా ఆధారంగా స్వాధీనం చేసుకున్న భారీ అక్రమ మద్యం నిల్వలను అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు.
గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో చట్టవిరుద్ధంగా తరలిస్తూ మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన కేసు (Cr.No.78/2024 U/s 34(a) A.P. Excise Act) లో స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల విలువ కలిగిన మొత్తం 38,379 మద్యం సీసాలను మునగపాక సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న లేఅవుట్ వద్ద చట్టబద్ధమైన పద్ధతిలో పూర్తిగా తొక్కించి/ధ్వంసం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ఈశ్వరరావు గారి పర్యవేక్షణలో, యలమంచిలి సీఐ శ్రీ ఎస్.ధనుంజయరావు మరియు మునగపాక ఎస్‌ఐ శ్రీ పి.ప్రసాద రావు ల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ /పోలీస్ అధికారులు మాట్లాడుతూ:
"జిల్లాలో అక్రమ మద్యం సరఫరా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా ఎన్నికల సమయం నుండి ఇప్పటివరకు శాంతిభద్రతల పరిరక్షణలో అనకాపల్లి జిల్లా పోలీసులు రాజీపడకుండా పనిచేస్తున్నారు. అక్రమ రవాణాపై మా నిఘా ఎల్లప్పుడూ కొనసాగుతుంది."
ప్రజా సంక్షేమం, చట్ట రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా పోలీసులకు ప్రజలు సహకరించి, ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.




