Anakapalli: అక్రమ బాణాసంచా కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Anakapalli: అనకాపల్లిలో బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. అనుమతులు లేకపోతే కేసులు నమోదు.
Anakapalli: అక్రమ బాణాసంచా కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
అనకాపల్లి: అనధికారికంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి డీఎస్పీ ఈ. శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై పోలీసు అధికారులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
డీఎస్పీ ఈ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమ కుమార్, అనకాపల్లి రూరల్ సర్కిల్ సీఐ అశోక్ కుమార్, రూరల్ ఎస్సై రవికుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి టౌన్ పరిధిలోని గవరపాలెం, తోటాడ పరిసర ప్రాంతాలతో పాటు రూరల్ పరిధిలోని రాజుపాలెం, వల్లూరు గ్రామాల్లోని బాణాసంచా తయారీ కేంద్రాలు, గోదాములను అధికారులు పరిశీలించారు.
తయారీ, నిల్వ కేంద్రాల్లో ఉన్న పేలుడు పదార్థాల వివరాలు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాల అందుబాటు, సంబంధిత లైసెన్సుల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా జనావాసాల మధ్య బాణాసంచా తయారీ లేదా నిల్వ చేపట్టకుండా నిర్వాహకులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఈ. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో లేదా జనావాసాల్లో బాణాసంచా తయారు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయాలు చేపట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం నుంచి అధికారిక లైసెన్సులు పొందిన బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాల నిర్వాహకులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిల్వ కేంద్రాల వద్ద తగిన అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనధికారికంగా బాణాసంచా నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి కార్యకలాపాలు గుర్తిస్తే ప్రజలు వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.




