Anakapalli: గంజాయి రవాణాదారుడిపై ‘పిట్ ఎన్‌డిపిఎస్’ చట్టం ప్రయోగం
Anakapalli: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో వరుస గంజాయి నేరస్థుడిపై PIT NDPS చట్టం ప్రయోగం. నిందితుడు గోపాలరావు విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు.
Anakapalli: గంజాయి రవాణాదారుడిపై ‘పిట్ ఎన్‌డిపిఎస్’ చట్టం ప్రయోగం
అనకాపల్లి: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా, వరుస గంజాయి నేరాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిపై అత్యంత కఠినమైన PIT NDPS (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances) చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు.
నిందితుడి వివరాలు - నేర నేపథ్యం:
పేరు: పోతురాజు గోపాలరావు (25 సం||లు), తండ్రి: నాగరాజు.
గ్రామం: భీమవరపుకోట (బి.బి.పట్నం), రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా.
నేర చరిత్ర: ఇతనిపై గతంలో రోలుగుంట పోలీస్ స్టేషన్‌లో మూడు వేర్వేరు గంజాయి కేసులు (Cr.No. 43/2017, 214/2021, 85/2023) నమోదై ఉన్నాయి.
నిత్యం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, సమాజానికి ముప్పుగా మారిన ఇతని ప్రవర్తనపై పోలీసులు నిఘా ఉంచారు. ప్రభుత్వం గంజాయిపై తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఉత్తర్వుల మేరకు నిందితుడిపై ఈ ప్రత్యేక చట్టాన్ని ప్రయోగించారు.
విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు:
కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, జిల్లా ఎన్.డి.పి.ఎస్ (NDPS) సెల్ సిఐ పిల్లా రమేష్ మరియు రోలుగుంట ఎస్సై రామకృష్ణారావుల ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసి, పటిష్ట భద్రత నడుమ విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు.
జిల్లా ఎస్పీ హెచ్చరిక:
"జిల్లాలో గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా లేదా విక్రయించినా ఎంతటి వారైనా సహించేది లేదనీ, అలవాటు పడిన పాత నేరస్తులపై కేవలం సాధారణ సెక్షన్లే కాకుండా, 'పిట్ ఎన్.డి.పి.ఎస్' వంటి కఠినమైన చట్టాలను ప్రయోగిస్తామని,అవసరమైతే నేరస్తుల ఆస్తులను కూడా జప్తు చేయడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా అనకాపల్లి ఎస్పి తుహిన్ సిన్హా ఐపీఎస్ తెలిపారు.




