Anakapalli: అనకాపల్లి జిల్లాలో రికార్డు స్థాయి గంజాయి పట్టివేత

Anakapalli: అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు గుడివాడ జంక్షన్ వద్ద జరిపిన వాహన తనిఖీల్లో రూ.1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 16 July 2026 1:49 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జిల్లాలో రికార్డు స్థాయి గంజాయి పట్టివేత

Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు అనకాపల్లి సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ శ్రీ జి.ఆర్.ఆర్.మోహన్ ఆదేశాల మేరకు, కొత్తకోట సిఐ జీ.కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు.

నమ్మదగిన సమాచారం మేరకు జరిపిన మెరుపు దాడిలో రావికమతం పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన రెండు లగ్జరీ కార్లను సీజ్ చేశారు.

​కేసు వివరాలు & గంజాయి పట్టివేత:

​రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో తేది.15.07.2026 మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో ఎస్సై ఎం.రఘువర్మ తన సిబ్బందితో కలిసి రావికమతం–అనకాపల్లి రహదారిలోని గుడివాడ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన రెండు కార్లను అడ్డగించి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.1.1 కోట్లు ఉంటుందని అంచనా.

సీజ్ చేసిన వాహనాలు:

​మారుతి ఎర్టిగా (Maruti Ertiga) – రిజిస్ట్రేషన్ నెం: AP40 JP 6216

​టాటా కర్వ్ (Tata Curvv) – రిజిస్ట్రేషన్ నెం: AP40 LM 1517

అదుపులోకి తీసుకున్న నిందితులు (అరెస్ట్):

కిల్లో తిమోతి (A1) (వయస్సు 26) – తండ్రి: రాజయ్య, నివాసం: గౌడుపుట్టు గ్రామం, ఇంజరి పంచాయతీ, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా (గంజాయి సప్లయర్).

షేక్ మహమ్మద్ రఫీ (A2) (వయస్సు 26) – తండ్రి: షేక్ మహబూబ్ షరీఫ్, నివాసం: సత్తెనపల్లి, పల్నాడు జిల్లా (గంజాయి కొనుగోలుదారుడు).

​షేక్ ఫయాజ్ (A3) (వయస్సు 19) – తండ్రి: షేక్ అల్లాబక్ష్, నివాసం: సత్తెనపల్లి, పల్నాడు జిల్లా (కారు డ్రైవర్ - AP40 LM 1517).

గమనిక: పోలీసుల తనిఖీ సమయంలో కార్లలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు, అలాగే మోటార్ సైకిల్‌పై ముందుండి పైలటింగ్ (దారి చూపుతూ) చేస్తున్న మరో ఇద్దరు నిందితులు పోలీసులను చూసి ఘటనా స్థలం నుండి పరారయ్యారు.

నేరానికి సంబంధించిన విచారణా వివరాలు:

పరిచయం – ప్రణాళిక: కొన్ని రోజుల క్రితం ఏఎస్సార్ జిల్లా పెదబయలు మండలంలోని తారాబు జలపాతం వద్ద A2 షేక్ మహమ్మద్ రఫీకి, స్థానిక గంజాయి వ్యాపారి A1 కిల్లో తిమోతితో పరిచయం ఏర్పడింది. లాభాల్లో వాటా పంచుకునే ఒప్పందంతో గంజాయిని సరఫరా చేస్తానని తిమోతి హామీ ఇచ్చాడు.

మొదటి విడత రవాణా: సుమారు నెల రోజుల క్రితం, A2 మహమ్మద్ రఫీ రెండు కార్లలో వెళ్లి A1 తిమోతి వద్ద 50 కిలోల గంజాయిని కొనుగోలు చేసి సత్తెనపల్లికి తరలించాడు. అక్కడ రెండు రోజులు నిల్వ ఉంచి, అనంతరం తమిళనాడులోని హోసూర్‌కు చెందిన సౌందర్ అనే వ్యక్తికి విక్రయించాడు.

ప్రస్తుత ముఠా ఆపరేషన్: తేది 14.07.2026 న A2 రఫీ తన అనుచరులతో కలిసి రెండు కార్లు, ఒక బైక్‌పై వెళ్లి A1 తిమోతి వద్ద 220 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. ఇందుకు గాను రూ.1.50 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తమిళనాడులో సౌందర్‌కు విక్రయించిన తర్వాత చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

రూట్ మ్యాప్ & ఎస్కాట్: పోలీసుల కన్నుగప్పేందుకు A1 కిల్లో తిమోతి స్వయంగా తన సహచరులతో కలిసి పాడేరు 12వ మైలురాయి నుండి చీడికాడ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ గంజాయి వాహనాలకు ఎస్కార్ట్ (పైలటింగ్) ఇచ్చి తీసుకువస్తుండగా గుడివాడ జంక్షన్ వద్ద రావికమతం పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు.

పోలీసుల తదుపరి చర్యలు – డీఎస్పీ గారి ప్రశంసలు:

​ఈ కేసులో రావికమతం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం: 52/2026, U/s 20(b), 25 r/w 8(C) NDPS Act కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు నిందితులు, సత్తెనపల్లికి చెందిన ముగ్గురు నిందితులు, అలాగే గంజాయి రిసీవర్ అయిన తమిళనాడు (హోసూర్)కు చెందిన సౌందర్ ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.

​సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఇంతటి భారీ గంజాయి రవాణా ముఠాను పట్టుకున్న రావికమతం ఎస్సై ఎం.రఘువర్మ, బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని అనకాపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీ జి.ఆర్.ఆర్.మోహన్ గారు ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులు అందించారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story