Anakapalli: అనకాపల్లి టౌన్ పీఎస్‌లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తనిఖీ

Anakapalli: అనకాపల్లి టౌన్ పీఎస్‌ను ఎస్పీ తుహిన్ సిన్హా తనిఖీ చేసి, రౌడీషీటర్లపై నిఘా, మహిళా రక్షణ, సైబర్ క్రైమ్‌లపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Sept 2026 8:13 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి టౌన్ పీఎస్‌లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తనిఖీ

అనకాపల్లి: అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రద్దీ, సున్నితమైన ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలని, పగలు, రాత్రి వేళల్లో బీట్ సిస్టమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో సీసీటీవీ నిఘాను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. వ్యాపార సంస్థలు, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మహిళలు, యువతుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సైబర్ మోసాలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచాలని ఎస్పీ సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI