Anakapalli: అనకాపల్లి రైతులకు శుభవార్త.. 'ఎల్లయ్య గ్రోయిన్' ప్రారంభం
Anakapalli: అనకాపల్లి శారదా నదిపై రూ. 1.19 కోట్లతో పునర్నిర్మించిన ఎల్లయ్య గ్రోయిన్‌ను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు.
Anakapalli: అనకాపల్లి రైతులకు శుభవార్త.. 'ఎల్లయ్య గ్రోయిన్' ప్రారంభం
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గ రైతులకు సాగునీటి భద్రత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు శారదా నదిపై తుమ్మపాల గ్రామం సమీపంలోని ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి శనివారం ప్రారంభించారు. డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులతో రూ.1.19 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల ద్వారా సుమారు 1,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని ఎల్లయ్య గ్రోయిన్‌ను ప్రారంభించారు. అనంతరం శారదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డీఎంఎఫ్‌టీ, ఇరిగేషన్ శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో డీసిల్టింగ్, కాలువల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
అలాగే, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరి ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల స్థానంలో కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




