Anandapuram: వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి - సీఐ ఎర్రం నాయుడు
Anandapuram: ఆనందపురంలో వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి అని సీఐ ఎర్రం నాయుడు తెలిపారు. డీజేలు, అసాంఘిక నృత్యాలపై నిషేధం విధించారు.
Anandapuram: వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి - సీఐ ఎర్రం నాయుడు
ఆనందపురం: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆనందపురం పోలీస్ స్టేషన్ CI VVCM ఎర్రం నాయుడు గారు సూచించారు.
వినాయక చవితి సందర్భంగా ఆనందపురం మండల పరిధిలో ఏర్పాటు చేసే ప్రతి వినాయక మండపానికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని CI స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డి.జి.పి. గారు మరియు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గారు ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు
వినాయక మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు www.ganeshutsav.net పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని CI garu తెలిపారు. పోలీసుల పరిశీలన అనంతరం అనుమతి పొందిన మండపాలకు QR కోడ్‌తో కూడిన NOC (No Objection Certificate) ఆన్‌లైన్‌లోనే జారీ అవుతుందని తెలిపారు.
అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటు చేయడం, అనుమతించిన నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడం చేయరాదని సూచించారు. వినాయక చవితి మండపాల వద్ద, ఊరేగింపుల సమయంలో మరియు విగ్రహ నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని CI ఎర్రం నాయుడు గారు స్పష్టం చేశారు.
అలాగే అసాంఘిక నృత్యాలు, అసభ్యకర కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి ఉండదని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా కేవలం నిబంధనలకు లోబడి సాధారణ మైకులు/సౌండ్ సిస్టమ్ మాత్రమే వినియోగించాలని సూచించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు
మండపాల ఏర్పాటుతో పాటు వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సీఐ సూచించారు. ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేయకుండా, పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు.
CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: మండపాల వద్ద భద్రతా పరంగా CC కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. మండపాల వద్ద నిర్వాహకులు, వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని భక్తులు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.
అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు తదితర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలి. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు, యువత మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని CI VVCM ఎర్రం నాయుడు గారు కోరారు.
ఉత్సవాల సందర్భంగా ఎటువంటి వివాదాలు, ఘర్షణలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ VVCM ఎర్రం నాయుడు హెచ్చరించారు.




