Araku: సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి వద్ద ప్లాస్టిక్ నిర్మూలన క్లీనప్ డ్రైవ్
Araku: అరకు సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి వద్ద పర్యాటక ప్రాంతాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు.
Araku: సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి వద్ద ప్లాస్టిక్ నిర్మూలన క్లీనప్ డ్రైవ్
అరకు: పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు సూచించారు.
మంగళవారం ఉదయం 7 గంటల నుంచి అరకులోయ మండలం సుంకరమెట్టలోని ప్రముఖ ఎకో టూరిజం ప్రాంతమైన ఉడెన్ బ్రిడ్జి వద్ద ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (APFDC) డివిజనల్ మేనేజర్ గెమ్మెలి కృష్ణబాబు ఆధ్వర్యంలో జిల్లా టూరిజం శాఖ సహకారంతో ప్లాస్టిక్ నిర్మూలన, పరిశుభ్రతపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టూరిజం అధికారి మాట్లాడుతూ, “పరిశుభ్రమైన, స్నేహపూర్వక, బాధ్యతాయుత ప్లాస్టిక్ రహిత పర్యాటకం” దిశగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పర్యాటకులు, స్థానిక వ్యాపారులు, ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఉడెన్ బ్రిడ్జి ఎకో టూరిజం ప్రాజెక్ట్ నిర్వహణ సిబ్బంది పనితీరును జిల్లా టూరిజం అధికారి అభినందించారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పర్యాటక ప్రాంతాల సహజ సౌందర్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞను అధికారులు, సిబ్బంది, స్థానికులు, వ్యాపారులతో చేయించారు. జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక పర్యాటక కేంద్రాన్ని ఎంపిక చేసి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అరకులోయ మండల ఎంపీడీఓ వి. ప్రసాద్ మాట్లాడుతూ, పర్యాటకులతో సిబ్బంది బాధ్యతాయుతంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించి వారికి ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల పరిశుభ్రత పరిరక్షణలో స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు, పర్యాటకులు భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో APFDC రేంజ్ అధికారి కె. అశేష, సుంకరమెట్ట పంచాయతీ కార్యదర్శి, ఉడెన్ బ్రిడ్జి ఎకో టూరిజం డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు, సిబ్బంది, స్థానిక చిరు వ్యాపారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




