Bheemili: ఎస్సీ కాలనీలో ఘనంగా అంగన్వాడీ వారోత్సవాలు
Bheemili: భీమిలి మండలం తాళ్లవలసలో అంగన్వాడీ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. 26 ఏళ్లుగా సేవనందిస్తున్న అంగన్వాడీ టీచర్, ఆయాలను ఘనంగా సత్కరించారు.
Bheemili: ఎస్సీ కాలనీలో ఘనంగా అంగన్వాడీ వారోత్సవాలు
భీమిలి: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గురువారం అంగన్వాడీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుస్మిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ సింగపూర్ బుజ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ టీచర్ బోని శారద, ఆయా మీనాకుమారిలను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అంగన్వాడీ కేంద్రంలో శారద, మీనాకుమారి సుమారు 26 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ చిన్నారుల సంరక్షణ, విద్య, పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు కొనియాడారు. ఇన్నేళ్లుగా అంగన్వాడీ సేవలకు అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిని సత్కరించడం ద్వారా వారి సేవలను గుర్తించడం సంతోషకరమని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు చేస్తున్న సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,స్థానిక నాయకులు,తల్లిదండ్రులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.




