Visakhapatnam: మానవత్వం చాటిన భీమిలి ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు!
Visakhapatnam: తగరపువలస రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలికకు భీమునిపట్నం ట్రాఫిక్ ఎస్ఐ బలగ తిరుపతిరావు సొంత డబ్బులు చెల్లించి చికిత్స అందించారు.
Visakhapatnam: మానవత్వం చాటిన భీమిలి ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు!
విశాఖపట్నం: పోలీసులంటే కేవలం శాంతిభద్రతలను కాపాడటమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిలా ఆదుకునే మనసున్న మహానుభావులని భీమునిపట్నం ట్రాఫిక్ ఎస్ఐ బలగ తిరుపతిరావు నిరూపించారు. రక్షాబంధన్ పర్వదినాన ఆయన చూపిన మానవత్వం స్థానికులను ముగ్ధులను చేసింది. వివరాల్లోకి వెళితే.. తగరపువలస జాతీయ రహదారి గోస్తనీ బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఒక ఘోర ప్రమాదం జరిగింది.
ఒక ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న గరికిన దేవి (14) అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. లక్కీగా బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు పిల్లలు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పూజారి మజ్జి రాంబాబు చొరవ తీసుకుని, గాయపడిన బాలికను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న భీమునిపట్నం ట్రాఫిక్ ఎస్ఐ బలగ తిరుపతిరావు వెంటనే ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే, అత్యవసర చికిత్స అందించడానికి ఆసుపత్రి సిబ్బంది ముందస్తు ఖర్చులు చెల్లించాలని మొండికేసారు. బాధితుల వద్ద తక్షణమే డబ్బులు లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బాలిక ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని భావించిన ఎస్ఐ తిరుపతిరావు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత ఫోన్-పే ఖాతా నుండి తక్షణమే రూ. 1,300 ఆసుపత్రికి చెల్లించి వైద్యం మొదలయ్యేలా చూశారు.
ఆపద సమయంలో 'నేనున్నానంటూ' ఖాకీ చొక్కా వెనుక ఉన్న కారుణ్యాన్ని చాటుకున్న ఎస్ఐ తిరుపతిరావు పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీసులు అంటే ప్రజల రక్షణ మాత్రమే కాదు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే దేవుళ్లు అని స్థానికులు కొనియాడుతున్నారు. సమాజ స్పృహతో, నిస్వార్థంగా స్పందించిన ఎస్ఐ తిరుపతిరావు, పూజారి రాంబాబుల మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.




