Vizag: మెగా డీఎస్సీలో పేకాట క్రీడా కోటా ఏంటి.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!

Vizag: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్రష్టుపట్టాయని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

GOPI, PENDURTHI
Published on: 2 Jun 2026 9:44 PM IST
Vizag
X

Vizag: మెగా డీఎస్సీలో పేకాట క్రీడా కోటా ఏంటి.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!

Vizag: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్రష్టుపట్టాయని, ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డిఎస్సీ పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, ఆఖరికి క్రీడల కోటా కింద 52 ముక్కల పేకాట (బ్రిడ్జ్) గేమ్‌ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో 10,300 మంది ఉపాధ్యాయులకు, 2 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి అవినీతి లేకుండా ఉద్యోగాలిచ్చిన రికార్డులు ఉన్నాయని స్పష్టం చేసిన ఆయన, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై మరియు మోసాలపై ప్రజల పక్షాన ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ రాకూడదంటూ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే ఆయనలో ఉన్న ఓటమి భయమే దానికి కారణమన్నారు. మోసం, మాయ, దగా మాటలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగంగా పోతే రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని ప్రజలు దేవుడిని కోరుకునే పరిస్థితి వచ్చిందని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

- నిబంధనల ఉల్లంఘన:

క్రీడా కోటా కింద ఉద్యోగాల భర్తీలో గతంలో ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్స్, జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతిభావంతులకు ప్రాధాన్యత ఉండేది. ఇందుకోసం 2012, 2026లో కూడా జీవోలు ఉన్నాయి. రాతపరీక్షలో పాసైన వారి మార్కుల ఆధారంగా స్పోర్ట్స్ కోటా ఇవ్వాల్సి ఉండగా, ఈ ప్రభుత్వం డిఎస్సీ పరీక్ష రాయనవసరం లేదంటూ జీవో ఇచ్చి, కేవలం సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు కట్టబెట్టింది. గతంలో ఉన్న 2 శాతం స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచారు. అయితే ఆ అదనపు 1 శాతం ఎవరి కోటా నుంచి తగ్గించారో ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.

- క్రీడల జాబితాలో పేకాట (బ్రిడ్జ్):

గతంలో 30 క్రీడలకు స్పోర్ట్స్ కోటా ఉంటే, ఈ ప్రభుత్వం దాన్ని 65కి పెంచిన ప్రభుత్వం.. అందులో ఐటమ్ నెంబర్ 40గా 'బ్రిడ్జ్' (52 ముక్కల పేకాట) గేమ్‌ను చేర్చడం సిగ్గుచేటు. 2025లో జీవో ఎంఎస్ నెంబర్ 4 కింద దీనిని చేర్చారని, ఇలాంటి నిర్ణయాల వల్ల యువత భవిష్యత్తులో క్లబ్బుల బాట పట్టే ప్రమాదం ఉంది.

- పారదర్శకత శూన్యం:

డిఎస్సీలో రూ.10 లక్షలు, రూ.15 లక్షల బేరసారాలు జరిగాయి, అర్హులైన 13,597 మందిలో కేవలం 11,224 మందికే జాబితా ఇచ్చి మిగిలిన వారిని పక్కనబెట్టారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు జిల్లా వెబ్‌సైట్లలో ఎందుకు పెట్టలేదు. ఈ అక్రమాలపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నాం. మా హయాంలో 10,300 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారాన్ని బొత్స తీవ్రంగా ఖండిస్తున్నాం. 2008 డిఎస్సీలో అర్హత సాధించి మిగిలిపోయిన 2,193 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 1998 డిఎస్సీలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 5,800 మందికి వైయస్.జగన్ హయాంలోఉద్యోగాలిచ్చాం. ప్రత్యేక నియామకాల ద్వారా.. 2019 స్పెషల్ డిఎస్సీ లో 520 మందికి, కేజీబీవీల్లో సుమారు 1,700 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమించాం. ఎలాంటి అవకతవకలు, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా 2 లక్షల మందికి పైగా క్వాలిఫైడ్ అభ్యర్థులకు సచివాలయ ఉద్యోగాలు కల్పించాం.

- భోగాపురం ఎయిర్ పోర్టు, ఫిషింగ్ హార్బర్లపై అబద్ధాల ప్రచారం.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూమి కేటాయించింది, నీరు, రోడ్డు కనెక్టివిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. కనీసం రోడ్డు, నీటి వసతి కల్పించకుండానే జూలైలో ప్రారంభిస్తామని ఎలా చెబుతారు. దీనిపై నిర్మాణ సంస్థ వాస్తవాలు మాట్లాడాలన్నారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల సామర్థ్యం పెంచేందుకు, కోనాడలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు తమ హయాంలోనే ప్రణాళికలు జరిగాయి, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఎందుకు పూర్తి చేయడం లేదు.

- స్థానిక కోటా ఎక్కడ?:

పరిశ్రమల్లో, 99 పైసలకే భూములు ఇచ్చి కట్టిస్తున్న మాల్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా గతంలో తాము తెచ్చిన జీవోలను ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. విశాఖ ఎంపీ భరత్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో వారి తాతగారు ఎంపీగా చేసినప్పుడు లేని ఆరోపణలు, ఈయన దోపిడీ విధానాల వల్లే ఇప్పుడు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ చేతగాని తనం వల్లే విశాఖకు రైల్వే జోన్ వచ్చినా కూడా ఆదాయం వచ్చే కేకే లైన్‌ను ఒడిశాకు కట్టబెట్టారు.

- జూన్ 4 నుండి 12 వరకు వైఎస్సార్‌సీపీ ప్రత్యేక కార్యక్రమాలు..

కూటమి ప్రభుత్వం రెండేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ, బాధితులకు అండగా నిలిచేందుకు ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాం. ఎన్నికల ముందు నిలిపివేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వాయిదాలను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు. పాఠశాల విద్యార్థులకు బుక్స్, బ్యాగులు ఎప్పుడు ఇస్తారో తేదీలు ప్రకటించాలి. సీబీఎస్ఈ (CBSE) సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల నుంచి తొలగించి, ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం దారుణం. ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపదు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా ఖూనీ చేస్తూ, విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. తప్పులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో పాలకులు ఉన్నారని, అందుకే ప్రజల పక్షాన నిలబడి జూన్ 4 నుండి 12 వరకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయబోతున్నామని స్పష్టం చేశారు.

- అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ..

వైయస్. రాజశేఖర్ రెడ్డిని ఎదురించానని పవన్ చెప్పిన వ్యాఖ్యలు తప్పు. నేను తెలంగాణ వెళితే నన్ను ఎవరూ ఆపలేదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే పోలీసులు అడ్డుకుంటారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయంటే అనుమతి ఇవ్వరు. పవన్ కళ్యాణ్ కి రాజశేఖర్ రెడ్డికి ఏం సంబంధం. పవన్ వైఎస్ ను ఎలా ఎదురించాడు. షర్మిల వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. ఆమె మాటలు రాజకీయ ఆలోచన కాదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story