Visakhapatnam: కలెక్టరేట్‌లో 22(ఏ) భూముల బాధితుల వినతిపత్రం అందజేత!
Visakhapatnam: విశాఖపట్నం కలెక్టరేట్‌లో 22(ఏ) భూముల బాధితుల ఆందోళన. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు.
Visakhapatnam: కలెక్టరేట్‌లో 22(ఏ) భూముల బాధితుల వినతిపత్రం అందజేత!
Visakhapatnam: 22(ఏ) భూముల జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆరఎస్‌లో విశాఖపట్నం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కు వినతి పత్రాలు అందజేశారు. అన్యాయంగా 22(ఏ) జాబితాలో చేర్చిన భూములను పూర్వస్థితికి పునరుద్ధరించాలని వారంతా కోరారు. విశాఖ జిల్లాకు సంబంధించిన సుమారు 88 పిటిషన్లను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ధర్నాలో సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్, మాజీ డీజీపీ ఏ.బీ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా 22(ఏ) బాధితులతో సమావేశం నిర్వహించామని తెలిపారు.
22(ఏ) జాబితాలో అనేక మధ్యతరగతి కుటుంబాల భూములు ఉన్నాయని, కొన్ని భూముల రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. 1970, 80, 90 దశకాల్లో భూములు కొనుగోలు చేసిన వారి రికార్డులను యజమానులు అందుబాటులో లేని సమయంలో మార్చిన ఘటనలను గుర్తించామని తెలిపారు. 22(ఏ) సెక్షన్ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించిన నిబంధన మాత్రమేనని అన్నారు.
ప్రైవేట్ వ్యక్తులు కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన ఆస్తులను 22(ఏ) జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఆస్తి యజమానులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను జాబితాలో చేర్చి, అనంతరం కోర్టుల చుట్టూ తిప్పడం సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కల్పించిన ఆస్తి హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 22(ఏ)కు సంబంధించిన పిటిషన్లపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా బాధితులను కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిప్పడం ఆందోళనకరమన్నారు.
ఇటీవల ప్రభుత్వం 22(ఏ) జాబితాలో ఉన్న సుమారు 10 లక్షల ఎకరాలను జీఓ నంబర్ 588 ద్వారా తొలగించిన నేపథ్యంలో, అర్హత ఉన్న ప్రైవేట్ భూములను కూడా సమగ్రంగా పరిశీలించి 22(ఏ) నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యతేనని, అయితే 22(ఏ) పేరుతో ప్రైవేట్ ఆస్తులపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. 22(ఏ)లో అన్యాయంగా చేర్చిన భూములు, బాధితుల వివరాలు, సంబంధిత ఆధారాలతో విశాఖపట్నం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కు ఫిర్యాదులు అందజేశామని చెప్పారు.
సమస్య పరిష్కారం కాకపోతే న్యాయపోరాటం
ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే బాధితులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వెంకటేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మరోసారి కలెక్టర్‌ను కలిసి, అవసరమైతే న్యాయపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలిపారు. అలాగే 22(ఏ) నిబంధనలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కార్యక్రమంలో సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్, అజయ్ ముల్లారెడ్డి, ఏం.జితేందర్, 22(ఏ) భూముల బాధితులు పాల్గొన్నారు.




