Golugonda: చీడిగుమ్మలలో పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన

Golugonda: గొలుగొండ మండలం చీడిగుమ్మలలో రూ. 1.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పీహెచ్‌సీ (మినీ ఆసుపత్రి) భవన నిర్మాణ పనులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 13 Oct 2026 8:25 PM IST
Golugonda
X

Golugonda: చీడిగుమ్మలలో పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన

గొలుగొండ: గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు వారి సతీమణి చింతకాయల పద్మావతి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, 1 కోటి 93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకం ఆవిష్కరించి లాంఛనంగా పనులను ప్రారంభించారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఒక మినీ ఆసుపత్రి తరహాలో దీనిని నిర్మిస్తున్నామని, రాబోయే ఆరు నెలల్లో అంటే మార్చి నాటికి ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు స్పష్టం చేశారు.

​నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒక్క చీడిగుమ్మల పంచాయతీ పరిధిలోనే గత రెండున్నరేళ్ల వ్యవధిలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 2 కోట్ల 49 లక్షల రూపాయలు, శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. నేడు శంకుస్థాపన చేసుకున్న 1 కోటి 93 లక్షల పీహెచ్‌సీ భవనంతో కలుపుకుని మొత్తంగా ఈ ఒక్క పంచాయతీకే 4 కోట్ల 52 లక్షల రూపాయల నిధులు అందించామని వివరించారు.

గొలుగొండ మండల వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 53 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా సుమారు 575 కోట్ల రూపాయలు వెచ్చించామని ఆయన పేర్కొన్నారు.

​వచ్చే ఏడాదిలో గ్రామాల్లో రోడ్ల పక్కన మురుగు నీరు నిలవకుండా పూర్తి స్థాయిలో సిమెంట్ కాలువలు (డ్రైనేజీలు) నిర్మిస్తామని అయ్యన్నపాత్రుడు గారు హామీ ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి సహకరించి, పనులు చేయించగలిగే దమ్మున్న మంచి నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల టీడీపీ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam