Chintoor: బాధ్యతల రోజే రక్తదానం: చింతూరు సబ్ కలెక్టర్ ఆదర్శం
Chintoor: చింతూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే చిత్తపులి నరేంద్ర పాడాల ఐఏఎస్ రక్తదానం చేసి ప్రజా మన్ననలు పొందారు.
Chintoor: బాధ్యతల రోజే రక్తదానం: చింతూరు సబ్ కలెక్టర్ ఆదర్శం
చింతూరు: చింతూరు సబ్ కలెక్టర్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన చిత్తపులి నరేంద్ర పాడాల అదే రోజు రక్త దానం చేసి ప్రజల మన్ననలు పొందారు. సబ్ కలెక్టర్ లో ఉన్న సేవ దృక్పథాన్ని చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు.రక్తదాన దినోత్సవం సందర్భంగా చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సబ్ కలెక్టర్ చిత్తపులి నరేంద్ర పాడాల ఐఏఎస్, సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్,ఇన్‌స్పెక్టర్ అంబు సీజన్,డాక్టర్ స్పందన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అధికారులు,సిబ్బంది రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులకు,శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రక్తం అవసరమైన వారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని తెలిపారు.
రక్తదానం పై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.రక్తం అవసరమైన సమయంలో సకాలంలో అందుబాటులో ఉండేలా స్వచ్ఛంద రక్తదాతలు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు, ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్యుల సూచనల మేరకు రక్తదానానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అధికారులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొని రక్తదాన శిబిరం నిర్వహణలో తమ సహకారం అందించారు.




