Anakapalli: రైతుల కష్టాలు తీరాలని చోడవరంలో వరుణ యాగం!
Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరాలయంలో వర్షాలు కురవాలని కోరుతూ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు ఆధ్వర్యంలో వరుణ యాగం.
Anakapalli: రైతుల కష్టాలు తీరాలని చోడవరంలో వరుణ యాగం!
Anakapalli: చోడవరంలో వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు వరుణ యాగం - ఎమ్మెల్యే K.S.N. రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చోడవరం నియోజకవర్గ కేంద్రంలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వరుణ యాగం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగానికి వేద పండితులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతుల కష్టాలు తీరాలని, జలాశయాలు నిండాలని సంకల్పంతో ఈ యాగం చేశారు. చోడవరం నియోజకవర్గ ప్రజల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరుని సన్నిధిలో నేడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవక పోవడం, రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న నేపథ్యంలో, ఆ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వరుణ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగంలో ప్రత్యేకత ఏమిటంటే.. వేద పండితులు సంప్రదాయబద్ధంగా నీటిలో నిలబడి వరుణ జపం చేయడం.
శాస్త్రాల ప్రకారం వరుణుడు జలానికి అధిపతి. అందుకే జలంలోనే ఉండి "ఓం వరుణాయ నమః" అంటూ, వరుణ సూక్తాలను పఠిస్తూ వందలాది సార్లు జపం చేశారు. ఈ దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదు. వారి జపంతో ఆ ప్రాంగణమంతా వేద ఘోషతో మారుమోగిపోయింది. జపం అనంతరం యాగశాలలో వరుణ యాగాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు గారు పాల్గొని, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. చోడవరం నియోజకవర్గంలో సస్యశ్యామలంగా పంటలు పండాలని, రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి కొరత తీరాలని సంకల్పం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
"మన చోడవరం ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. గత కొంత కాలంగా వర్షాలు సరిగా లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే స్వయంభూ విఘ్నేశ్వరుని సాక్షిగా, పెద్దల సూచన మేరకు వరుణ యాగం చేయడం జరిగింది. వరుణ దేవుని కరుణతో త్వరలోనే మంచి వర్షాలు కురిసి, మన చెరువులు, కుంటలు నిండి, రైతన్నకు మేలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు
ప్రధానార్చకులు కొడమంచిలి చలపతిరావు శర్మ మాట్లాడుతూ.....
"వరుణ యాగం అనేది అత్యంత శక్తివంతమైనది. వేదాలలో వరుణ దేవుడిని ప్రకృతి సమతుల్యతకు ప్రతీకగా చెబుతారు. ఇలా నీటిలో ఉండి జపం చేసి, యాగం చేయడం వల్ల వరుణుడు త్వరగా ప్రసన్నుడై, అకాల వర్షాలను నివారించి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని శాస్త్ర వచనం."అని తెలిపారు
మొత్తానికి రాజకీయాలకు అతీతంగా, ప్రజల శ్రేయస్సు కోసం ఎమ్మెల్యే చేపట్టిన ఈ వరుణ యాగం చోడవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. విఘ్నేశ్వరుని దయ, వరుణ దేవుని కరుణతో త్వరలోనే ఈ ప్రాంతం జలకళతో కళకళలాడుతుందని భక్తులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




