Vizag: సైకిల్‌పై సీఎం.. సీఫుడ్ ఎగుమతులపై జాతీయ సదస్సు
Vizag: శుక్రవారం వైజాగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు బిజీ పర్యటన. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సైకిల్ యాత్ర, కేంద్ర మంత్రులతో కలిసి జాతీయ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్ ప్రారంభం.
Vizag: సైకిల్‌పై సీఎం.. సీఫుడ్ ఎగుమతులపై జాతీయ సదస్సు
Vizag: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విశాఖపట్నంలో బిజీ షెడ్యూల్‌తో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై ప్రయాణించడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రాధాన్యత పొందుతున్న సీఫుడ్ ఎగుమతుల రంగంపై నిర్వహించే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
*పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ యాత్ర*
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఉదయం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మొక్క నాటనున్నారు. అనంతరం "నెట్ జీరో" కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఇటీవల "పవర్ ఆఫ్ సైకిల్" భావనను ప్రోత్సహిస్తున్న సీఎం, ఇంధన వినియోగం తగ్గించడం, కాలుష్య నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణలో సైకిల్ వినియోగం కీలకమని పలుమార్లు పేర్కొన్నారు.
*విశాఖలో జాతీయ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్*
బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్‌లో నిర్వహించే నేషనల్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్ దేశవ్యాప్తంగా ఆక్వా, మత్స్య రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురానుంది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్చి,రాగ్ పాశ్వాన్,రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్,S. P. సింగ్ బేగెల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు...ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు, మెరైన్ ఫిషరీస్, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృత చర్చ జరగనుంది.
*ఆక్వా రంగానికి కొత్త మార్కెట్లపై చర్చ*
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సీఫుడ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యూరోపియన్ యూనియన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఉత్పత్తుల అవకాశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రొయ్యలు, చేపలు, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు అవసరమైన వ్యూహాలపై నిపుణులు సూచనలు ఇవ్వనున్నారు...ఆక్వా ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, ట్రేసబిలిటీ వ్యవస్థలు, అంతర్జాతీయ సర్టిఫికేషన్లు, ఎగుమతులలో ఎదురవుతున్న సవాళ్లు వంటి అంశాలు కూడా చర్చలో ప్రధానంగా నిలవనున్నాయి.
*డీప్ సీ ఫిషింగ్ నుంచి ముత్యాల పెంపకం వరకు*
భారత తీర ప్రాంతాల్లో కొత్త అవకాశాల అన్వేషణకు ఈ వర్క్‌షాప్ వేదిక కానుంది. అండమాన్-నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల్లో డీప్ సీ ఫిషింగ్, సముద్రపు కలుపు (సీవీడ్) సాగు, ఆర్నమెంటల్ ఫిష్ కల్చర్, ముత్యాల పెంపకం వంటి అధిక ఆదాయ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరగనుంది.
ఇవి సంప్రదాయ మత్స్యకార కుటుంబాలకు అదనపు ఆదాయ వనరులను కల్పించడమే కాకుండా ఎగుమతుల విలువను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
*లబ్ధిదారులకు ప్రోత్సాహకాలు*
పీఎంకేఎస్‌ఎస్‌వై (PMKSSY), కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాల కింద లబ్ధి పొందిన రైతులు, మత్స్యకారులకు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా ఆక్వా రంగంలో పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
*విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్*
సీఫుడ్ వర్క్‌షాప్ అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER)పై ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలుపుకుని పారిశ్రామిక, ఐటీ, పోర్టులు, లాజిస్టిక్స్, తయారీ రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, ఉత్తరాంధ్రను దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ రీజియన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
*ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక పర్యటన*
పర్యావరణ పరిరక్షణ, సీఫుడ్ ఎగుమతుల విస్తరణ, ఆక్వా రంగ అభివృద్ధి, విశాఖ ఎకనామిక్ రీజియన్ పురోగతి వంటి నాలుగు కీలక అంశాల చుట్టూ సీఎం చంద్రబాబు పర్యటన సాగనుంది. ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల పెంపుదల దిశగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం సాయంత్రం సమీక్ష సమావేశాల అనంతరం అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.




