Vizag: జూలై 24 వరకు ఇంటింటి సర్వే.. అక్టోబర్ 3న తుది జాబితా!
Vizag: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సవరించిన షెడ్యూల్‌ను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు. అక్టోబర్ 3న తుది జాబితా విడుదల కానుంది.
Vizag: జూలై 24 వరకు ఇంటింటి సర్వే.. అక్టోబర్ 3న తుది జాబితా!
విశాఖపట్నం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24లోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పారు.
అనంతరం వాటి విచారణ, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 వరకు పూర్తి చేసి, అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. ముందు షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టంబర్ 22న తుది జాబితా ప్రచురణ జరగాల్సి ఉందని గుర్తు చేశారు.
జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని ఎన్నికల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లినప్పుడు ఓటర్లు పూర్తి సహకారం అందించి అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాలని కోరారు.అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సవరించిన షెడ్యూల్‌ను గమనించి ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




