Chodavaram: చోడవరం పీజీఆర్ఎస్ సదస్సులో అధికారులపై కలెక్టర్ సీరియస్
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరంలో "ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు" ముగింపు సదస్సు. క్షే
Chodavaram: చోడవరం పీజీఆర్ఎస్ సదస్సులో అధికారులపై కలెక్టర్ సీరియస్
Chodavaram: జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ నియోజకవర్గ పరిధిలోని భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం చోడవం నియోజకవర్గం, చోడవరం మండలం, కొత్తూరు జంక్షన్ లో మాధవ ఫంక్షన్ హాల్ లో ఒక నెల- ఒక నియోజక వర్గం- నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.ఎస్ రాజు తో కలసి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ..
ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కారం మరియు రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం "ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు" కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నిశితంగా సమీక్షించిన కలెక్టర్, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఏం పని చేస్తున్నారంటూ హెచ్ఓడీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల వేదికకు ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి ప్రధాన కారణం,
క్షేత్రస్థాయిలో అధికారులు వారికి సమస్యలపైన సరైన అవగాహన కల్పించకపోవడమేనని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.ఏదో ఒక సమాధానం చెప్పి దరఖాస్తులను ముగించడం కాకుండా, సమస్యలను శాశ్వతంగా మరియు చట్టబద్ధంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, అధికారులు దీనిని గమనించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్బంగా చోడవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, డ్వామా, బీసీ వెల్ఫేర్, విద్యుత్ శాఖ, హౌసింగ్, పౌర సరఫరాలు, కో-ఆపరేటివ్, డి సి హెచ్ ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఎండోమెంట్, వైద్య ఆరోగ్య శాఖ, ఫిషరీస్, మైనింగ్, పంచాయతీరాజ్, ఎక్సైజ్ శాఖ, రిజిస్ట్రేషన్లు, డి ఆర్ డి ఏ, ఆర్ డబ్ల్యు ఎస్ శాఖలకు సంబంధించి వచ్చిన అర్జీలు, పరిష్కరించిన అర్జీలు,
మిగిలిన దరఖాస్తులు ఎప్పటిలోగా పరిష్కరించాలి అనే విషయాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొన్ని మండలాల్లో గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కార ప్రగతి బాగుందని, అయితే మరికొన్ని మండలాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. కొంతమంది అధికారులు పూర్తి సన్నద్ధతతో, నివేదికలతోరాగా, మరికొందరు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ..
గత నాలుగు వారాలుగా చోడవరం నియోజకవర్గం లో వచ్చిన గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ రోజుతో గడువు ముగుస్తున్నప్పటికీ, పెండింగ్ సమస్యల తీవ్రతను బట్టి మరో వారం రోజుల పాటు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గడువు ముగిసినంత మాత్రాన పర్యవేక్షణ ఉండదని అనుకోవద్దని, ప్రతి ఒక్క దరఖాస్తు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని హెచ్చరించారు. గ్రీవెన్స్ పరిష్కారాలపై వారం, వారం సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి, వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు.
చోడవరం శాసనసభ్యులు కె. ఎస్.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ..
చోడవరం గ్రీవెన్స్ సెషన్‌కు అనూహ్య స్పందన, బాధితుల సమస్యలపై అధికారులు ‘పాజిటివ్’ దృక్పథంతో వ్యవహరించాలి చోడవరంలో గత నాలుగు వారాలుగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగిందని వెల్లడించారు.
మొదటి మూడు వారాల్లోనే 1346 దరఖాస్తులు రాగా, నాలుగో వారమైన ఈ రోజు వచ్చిన వాటితో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య దాదాపు 1800 కు చేరవచ్చని ఆయన తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారులందరి సమష్టి సహకారంతోనే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.
చోడవరంలో మనం ఈ గ్రీవెన్స్ సెషన్స్ ఏర్పాటు చేసినప్పటి నుండి, రోలుగుంట వంటి అత్యంత మారుమూల ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో తరలివచ్చి తమ అర్జీలను సమర్పిస్తున్నారు. ఇక్కడికి వస్తే తమ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారమవుతాయనే భరోసా వారిలో ఉంది. ఆ నమ్మకాన్ని అధికారులు, ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు. ఒక అప్లికేషన్ రాగానే కేవలం పుస్తకాల్లోని రూల్స్ చూసి, ఆ పని "ఎందుకు అవ్వదో" చెప్పే ప్రయత్నం కంటే, అధికారులు అదే రూల్స్ పరిధిలో ఆ పనిని "ఎలా చేయవచ్చు", ప్రజలకు "ఎలా న్యాయం చేయగలం" అనే సానుకూల (Positive) దృక్పథంతో పనిని పూర్తి చేయాలని కోరారు.
గత నాలుగు వారాలుగా ఎంతో శ్రమకోర్చి, ఈ కార్యక్రమానికి హాజరవుతున్న జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, DRO గారికి, అలాగే అనకాపల్లి మరియు నర్సీపట్నం ఆర్డీఓ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, క్షేత్రస్థాయి మరియు గ్రామ స్థాయి నుండి వచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్క అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, ఇన్చార్జి డి ఆర్ ఓ, వై. శ్రీనివాసరావు, ఆర్డీవోలు ఆయేషా, వెంకట రమణ లు వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో హాజరైనారు.




