Paderu: పాడేరులో ఓటర్ల జాబితా పారదర్శకత కోరుతూ కాంగ్రెస్ నిరసన!
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఓటర్ల జాబితా పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
Paderu: పాడేరులో ఓటర్ల జాబితా పారదర్శకత కోరుతూ కాంగ్రెస్ నిరసన!
Paderu: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్ ప్రతిపక్ష నేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శతక బుల్లిబాబు ఆధ్వర్యంలో పాడేరులో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టి, ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం కోసం నినదించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే భర్తరఫ్ చేసి, ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ “ఓట్ చోరీ”గా ఆరోపిస్తున్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని శాంతకుమారి డిమాండ్ చేశారు.
13.3 కోట్ల ఓటర్ల అంశంపై స్పష్టత ఇవ్వాలి
SIR ప్రక్రియలో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించబడినట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రతి ఓటరు పేరు తొలగింపుకు కారణం ఏమిటో పారదర్శకంగా వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకూడదని, అనర్హంగా తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను తక్షణమే పునరుద్ధరించాలని పాచిపెంట శాంతకుమారి కోరారు.
ఎన్నికల జాబితాలపై వచ్చిన ఆరోపణలు, డిజిటల్ వ్యవస్థలో మార్పులు, ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై స్వతంత్రంగా, పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓటర్ల జాబితా సాఫ్ట్‌వేర్‌పై సమీక్ష చేపట్టినట్లు కూడా నివేదికలు వెలువడ్డాయి.
“ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం. అర్హుడైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత. ఓటర్ల జాబితాపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలి” అని శాంతకుమారి అన్నారు.
ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ రీమల నవభారత్, అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శెట్టి గంగాధర్ స్వామి ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ టి సోమేశ్వర, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ చంద్రకళ భాను సీహెచ్ రావు, గంపరాయి కోర్ర మితుల. అన్ని మండల అధ్యక్షులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




