Araku: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సర్వసన్నద్ధం గంగాధర్ స్వామి!
Araku: అరకు వేలి నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని నియోజకవర్గ ఇన్చార్జి శెట్టి గంగాధర్ స్వామి స్పష్టం చేశారు.
Araku: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సర్వసన్నద్ధం గంగాధర్ స్వామి!
Araku: అరకు వేలి నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారని అరకు వేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శెట్టి గంగాధర్ స్వామి స్పష్టం చేశారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులతో పోటీ చేసి ప్రజల మద్దతు పొందేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
గిరిజన హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం!
గిరిజనుల హక్కులు, చట్టాలు, రాజ్యాంగం కల్పించిన రక్షణలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని శెట్టి గంగాధర్ స్వామి అన్నారు. ఐదవ షెడ్యూల్, పీసా చట్టం (PESA), 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం వంటి గిరిజన రక్షణ చట్టాల స్ఫూర్తిని కాపాడుతూ, గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
గిరిజనుల హక్కులు కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకూడదు. చట్టాలు పటిష్టంగా అమలై, గిరిజనులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది అని పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం!
అరకు వేలి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ప్రజలతో సంబంధాలు, సేవా దృక్పథం, పార్టీ పట్ల నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో నెలకొన్న రహదారుల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, పారిశుధ్య లోపాలు, గిరిజన గ్రామాలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందకపోవడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తుందని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేస్తాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని శెట్టి గంగాధర్ స్వామి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గిరిజన హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
అధికారమే లక్ష్యం కాదు.. ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. గిరిజన హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, గ్రామీణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు వేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా నిలిచేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అని శెట్టి గంగాధర్ స్వామి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కిషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కురిడీ అప్పారావు సర్బా నాగేశ్వరరావు శెట్టి రాజు చిట్టం నాయక్ బల్ బదర్ మజ్జి అర్జున్ పాల్ తదితరులు పాల్గొన్నారు.




