Arilova: విశాఖ అరిలోవలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 7 వాహనాలు సీజ్!

Arilova: విశాఖపట్నం అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

JAI RAM, MADURAWADA
Published on: 25 Oct 2026 8:49 AM IST
Arilova
X

Arilova: విశాఖ అరిలోవలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 7 వాహనాలు సీజ్!

Arilova: నగరంలోని అరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధి, సెంట్రల్‌ జైలు సమీపంలోని కృష్ణాపురం ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అక్రమ వస్తువుల గుర్తింపు, అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాల పరిశీలన, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీసులు స్థానికంగా ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని ఐదు బైక్‌లు, రెండు స్కూటర్లను గుర్తించి మొత్తం ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే, ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని కోరారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అద్దెదారుల వివరాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112కు ఫోన్‌ చేసి పోలీసుల సహాయం పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA