Visakhapatnam: వంద రోజులేమాయే? చంద్రబాబు సర్కార్‌పై జగ్గునాయుడు ఫైర్
Visakhapatnam: విశాఖ పంచగ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు డిమాండ్ చేశారు.
Visakhapatnam: వంద రోజులేమాయే? చంద్రబాబు సర్కార్‌పై జగ్గునాయుడు ఫైర్
Visakhapatnam: పంచగ్రామాల ప్రజల భూ సమస్యను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూ సమస్యను వంద రోజుల్లో పరిష్కరిస్తానని 2024 జనవరిలో విశాఖలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ రెండేళ్లయినా పరిష్కరించకుండా జాప్యం చేయడం దుర్మార్గమన్నారు.
సీపీఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో సిపిఎం గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి.జగన్, జిల్లా కమిటీ సభ్యలు బి వెంకటరావుతో కలిసి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, పశ్చిమ, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ మే 3 నుంచి 12 వరకు మరోదఫా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ ఆందోళనలో ప్రజలు భాగస్వాములుకావాలని విజ్ఞప్తిచేశారు.
1903 గిల్ మేన్ సర్వే రికార్డుల ప్రకారం సింహాచలం దేవస్థానానికి 39.5 ఎకరాల భూమి మాత్రమే ఉంది. 1785 ఎకరాల భూమిలో పంచగ్రామాల ప్రజలే వ్యవసాయం సాగుచేస్తూ ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూ పూర్తి హక్కు దారులుగా వున్నారని రికార్డులో పేర్కొన్నారు. 1995 వరకు వీరు ఈ భూములను, ఇళ్లను ఎటువంటి వివాదాల్లేకుండా అనుభవిస్తున్నారు.
1996లో చంద్రబాబు ప్రభుత్వం పెందుర్తి, చినగదిలి తహశీల్దార్ల ద్వారా 11,802 ఎకరాల భూమిలో 9069 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి కట్టబెడుతూ రైత్వారీ పట్టాలను జారీచేయించారు. 2000 సంవత్సరంలో జిఓ 578 తెచ్చి హక్కుదారులుగా వున్న ప్రజలందరినీ ఆక్రమణదారులుగా పేర్కొంటూ చంద్రబాబు ప్రభుత్వమే సమస్యను సృష్టించింది.
దీనివల్ల పంచగ్రామాల ప్రజలు, సింహాచలం దేవస్థానం కొండచుట్టవున్న ప్రాంతాల్లో నివశిస్తున్న సుమారు రెండు లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. తమ పిల్లల చదువులు, వివాహాల కోసం, తమ అస్తులను అమ్ముకోలేని స్థితి ఏర్పడింది. ఇళ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేసుకోనియకుండా దేవస్థానం అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్యపై సిపిఎం పార్టీ, వివిధ ప్రజా సంఘాలు న్యాయపోరాటం చేశాయి.
2010లో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమిషనర్, విశాఖ ఆర్డిఓ విచారణ జరిపి పంచగ్రామాల ప్రజలే ఈ భూములకు హక్కుదారులని ప్రకటించారు. వీటిని ప్రభుత్వం పక్కన పడేసింది. పంచగ్రామాల ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కోట్లు, కొత్త భూములు అడగడంలేదు. దశాబ్దాల తరబడి హక్కుదారులుగా వుండి వ్యవసాయం, ఇళ్ల నిర్మాణాలతో జీవిస్తున్న తమ భూములు, ఇళ్లకు హక్కు పత్రాలు మాత్రమే అడుగుతున్నారు. ఈ న్యాయమైన డిమాండ్ ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అదానీ, లూలూ, మిట్టల్ వంటి కార్పొరేట్ శక్తులకు ఆగమేఘాలపై వందల ఎకరాల భూములను కట్టబెడుతూవుంది. తమకు అధికారం ఇచ్చిన ప్రజలను కష్టాల్లోకి నెడుతోంది. తమను నమ్మి ఓట్లువేసి ప్రజలు గెలిపిస్తే విశాఖ ఎంపీ శ్రీభరత్, యండాడ, రుషికొండ ప్రాంతాల్లోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్శిటీ కోసం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించకుండా, దేవస్థానం భూములను గూగుల్ కు ముఖ్యమంత్రి కట్టబెడుతూవుంటే స్థానిక ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, గంటా శ్రీనివాసరావులు నోరు విప్పకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
సిపిఎం గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్, జిల్లా కమిటీ సభ్యులు బి.వెంకటరావు మాట్లాడుతూ 1903 గిల్ మేన్ సర్వే రికార్డు ప్రకారం పంచగ్రామాల ప్రజలను హక్కుదారులుగా గుర్తించి శాశ్వత పట్టాలు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పంచగ్రామాల ప్రజలకు హక్కుదారు పట్టాలు తక్షణమే జారీ చేయాలి, రైతులు, ప్రజలు తమ భూములు, ఇళ్లను క్రయవిక్రయాలు చేసుకోనివ్వాలి. ఇళ్ల నిర్మాణాలు,
మరమ్మతులకు దేవస్థానం అధికారుల ఆటంకాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వీరికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 3 నుంచి 12 వరకు పాదయాత్రలు, సమావేశాలు, సభలు, కరపత్రాల పంపిణీ తదితర రూపాల్లో ఆందోళన చేపడుతున్నామని, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని విజ్ఞప్తిచేశారు.




