Visakhapatnam: ఆదాయం తరలింపుపై కుట్ర.. విశాఖ రైల్వే జోన్‌పై రచ్చ!
Visakhapatnam: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు తెలిపారు.
Visakhapatnam: ఆదాయం తరలింపుపై కుట్ర.. విశాఖ రైల్వే జోన్‌పై రచ్చ!
Visakhapatnam: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభానికి రైల్వేశాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ను సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నది. కొత్తవలస, కిరండూల్ (కెకెలైన్), అరకు పర్యాటక కేంద్రాన్ని విశాఖ డివిజన్లోనే కొనసాగించాలి. విశాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు చేపట్టేలా కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. గురువారం మద్దిలపాలెంలోని సిపిఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, ఆర్ కె ఎస్ వి కుమార్, వి కృష్ణారావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిపిఎం, వామపక్ష పార్టీలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు, అభివృద్ధికాముకులు 12 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా రైల్వే జోన్ సాధించబడిందన్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల హక్కు. ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం షెడ్యూల్ 13 (8)లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సిందే. కానీ కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం కావాలని ఇంతవరకు విశాఖకు ద్రోహంచేస్తూ వస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన గత వైసిపి ప్రభుత్వం, నేటి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాయి.
రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటించినా, విశాఖ ప్రజలకు కేంద్ర మోడీ ప్రభుత్వ ద్రోహం, కూటమి ప్రభుత్వ అవకాశవాదం కొనసాగడం ఆందోళనకరం. దేశంలోనే టాప్ టెన్ డివిజన్లో వాల్తేర్ రైల్వే డివిజన్ ఒకటి. ఈ డివిజన్లోని కేకే లైన్ అత్యంత కీలకమైనది. వాల్తేర్ డివిజన్ 2025- 26 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,598.07 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా 17% ఆదాయం పెరిగింది. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 78. 464 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా సుమారు 17% పెరిగింది. ఈ లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు, ఆహారధాన్యాలు, ఇంధనాలు, ఆయిల్, సిమెంట్, పారిశ్రామిక ఉత్పత్తులు, ముడిసరుకులు మొదలగునవి రవాణా అవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పెంచుతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల భవిష్యత్ లో ఎగుమతులు, దిగుమతులు పెరిగి పెద్ద ఎత్తున ఈ డివిజన్ కు ఆదాయం పెరుగుతుంది.
దేశంలోనే రెండవ ఊటీగా ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకు, బొర్రా గుహల రైల్వే స్టేషన్ ఈ కేకే లైన్ పరిధిలోనే ఉన్నాయి. బంగారుబాతు వంటి ఈ కేకేలైన్ ను తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర మోడీ ప్రభుత్వం ఒడిశా రాష్ట్రంలోని రాయగడ డివిజన్ కు తరలించుకుపోయింది. పండులోని గుజ్జునంతా తినేసి తొక్కను మనకు వదిలింది. ఈ ద్రోహాన్ని నిలువరించి, విశాఖ ప్రజల ప్రయోజనాలు రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబు కూటమి ప్రభుత్వానిది. ఈ పనిచేయకుండా కూటమి నేతలు సంబరాలు జరపడం ప్రజలను పక్కదారి పట్టించడమేనన్నారు. వీరికి విశాఖ ప్రజల ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కేకే లైన్, అరకు ప్రాంతాలను విశాఖపట్నం డివిజన్ (పాత వాల్తేరు డివిజన్) లోనే కొనసాగించే చర్యలు చేపట్టాలి.
జోన్ విశాఖ ప్రజలకు ఇచ్చి, ఆదాయాలను తను అధికారంలో ఉన్న ఒడిశా రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తరలించుకుపోతోంది. ఇది విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలను వంచించడమే. ఈ కుట్రలను ఆపాలని డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కేంద్రం భువనేశ్వర్ లో ఉండటం వల్ల మన యువతకు రైల్వే ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పరీక్షలు, ప్రయాణాల నిమిత్తం నిరుద్యోగులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు పెరిగేందుకు, కష్టాలు తీరేందుకు విశాఖలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి కీలక అధికారాన్ని ఇచ్చారు. దీనిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ కెఎస్వి కుమార్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ సాధన కోసం వివిధ పార్టీలు, తరగతుల ప్రజలు చేపట్టిన పోరాటాల సందర్భంగా పెట్టిన కేసులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.




