Polavaram: అక్వాన్ తుఫాను ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!

Polavaram: అక్వాన్ తుఫాను ముప్పు నేపథ్యంలో నవంబర్ 17–20 వరకు పోలవరం ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.

Prasanna, Rampachodavaram
Published on: 16 Nov 2026 9:06 PM IST
Polavaram
X

Polavaram: అక్వాన్ తుఫాను ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!

Polavaram: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' తుఫానుగా బలపడి, తదుపరి తీవ్ర లేదా అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబర్ 20, 2026 నాటికి నెల్లూరు–తుని మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలవరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.

తుఫాను ప్రభావంతో నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు పోలవరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాలతో పాటు చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదని, పొంగిపొర్లే వాగులు, వంకలు, లోతట్టు వంతెనలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు సాగించేందుకు ప్రయత్నించరాదని సూచించారు. గోదావరి, శబరి, సీలేరు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, భూపతిపాలెం జలాశయం పరిసర ప్రాంతాల వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పెద్ద చెట్ల సమీపంలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని తెలిపారు.

తెగిపడిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు.

రైతులు కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఉద్యానవన పంటలను వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా భద్రపరచుకోవాలని, కోసిన ధాన్యం తడవకుండా గోదాముల్లో లేదా టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచాలని సూచించారు. పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా నీటి పారుదల కాలువలను సిద్ధం చేసుకోవాలని, పశువులు, జీవాలను బలహీనమైన షెడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఉంచకుండా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని తెలిపారు.

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రంపచోడవరం కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాలోని మొత్తం 12 మండలాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలు, అత్యవసర మందులు, జేసీబీలు, నిత్యావసర సరుకులను సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణలేని వార్తలు, వదంతులను ప్రజలు నమ్మరాదని, జిల్లా యంత్రాంగం మరియు భారత వాతావరణ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం, రక్షణ చర్యల కోసం రంపచోడవరంలోని జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-4225 ను సంప్రదించాలని సూచించారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram