Paderu: పాడేరు ఏజెన్సీలో తుఫాను కష్టాలు: విద్యార్థినుల అవస్థలు

Paderu: పాడేరు ఏజెన్సీలో తుఫాను అనంతరం విద్యుత్ నిలిచిపోయి, హాస్టళ్లలో నీరు లేక గిరిజన విద్యార్థినులు కాలకృత్యాల కోసం అడవుల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

SAI, PADERU
Published on: 29 Oct 2026 2:38 PM IST
Paderu
X

Paderu: పాడేరు ఏజెన్సీలో తుఫాను కష్టాలు: విద్యార్థినుల అవస్థలు

Paderu: ఇటీవల సంభవించిన తుఫాను ధాటికి గిరిజన ప్రాంతాలు తీవ్ర అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాఠశాలలు, హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గిరిజన విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి కూడా నీరు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

​చెట్లు, గుట్టల బాట పట్టిన బాలికలు:

హాస్టళ్లలోని మోటార్లు నడవకపోవడంతో ట్యాంకుల్లో నీరు ఖాళీ అయింది. దీంతో వేకువజామునే బాలికలు కాలకృత్యాల కోసం, బాత్రూమ్‌ల కోసం సమీపంలోని అడవులు, చెట్లు, గుట్టల బాట పడుతున్నారు. విద్యుత్ కోతలతో ఒకవైపు చీకటి, మరోవైపు విషపురుగులు తిరిగే ప్రాంతాల్లో బయటకు వెళ్లాల్సి రావడం వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు, తుఫానుల వేళ ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది.

​రోగాల బారిన పడే ప్రమాదం:

తాగునీరు, వాడుక నీరు లేకపోవడంతో విద్యార్థినులు పరిశుభ్రత పాటించలేకపోతున్నారు. దీనివల్ల వివిధ రకాల అంటురోగాలు, చర్మవ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఇలాంటి అత్యవసర సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​తక్షణమే స్పందించాలి:

యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, విద్యుత్ వచ్చే వరకు హాస్టళ్లకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని లేదా జనరేటర్ల ఏర్పాటుతో మోటార్లు నడిపించాలని విద్యార్థినులు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గిరిజన బాలికల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.

SAI, PADERU

SAI, PADERU