Visakhapatnam: విశాఖలో దళిత విముక్తి మహాసభ.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ

Visakhapatnam: విశాఖపట్నంలో దళిత విముక్తి సంఘాల భారీ ప్రదర్శన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు, దళితులకు భూ పంపిణీ చేయాలని స్వర్ణ వెంకటరమణ డిమాండ్.

GOPI, PENDURTHI
Published on: 2 July 2026 4:11 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో దళిత విముక్తి మహాసభ.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ

విశాఖపట్నం: ప్రైవేటీకరణ వద్దు జాతీయీకరణ కావాలి.. పేదలు, దళితులకు భూ పంపిణీ ,రిజర్వేషన్ పరిరక్షణ జరగాలని డిమాండ్ చేస్తూ దళిత విముక్తి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ర్యాలీ -బహిరంగ సభలను నిర్వహించారు. డాబా గార్డెన్స్ ఎల్ఐసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడ నుండి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీల్ మెట్ట , మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.

అనంతరం దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ణ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పలువురు దళిత, ప్రజా సంఘాల నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు భూగరిష్ట పరిమితి చట్టాలకు వ్యతిరేకంగా భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు . గతంలో పేదలు ,దళితులకు సాగు నిమిత్తం పంచిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు.

వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని చట్టాలున్నా అమలు కావడం లేదని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాలచొప్పున సాగుభూమి పంపిణీకి జీవో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ అమలు కాలేదని దుయ్యబట్టారు. భూమిలేని పేదలకు తక్షణమే భూములు పంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పిస్తూ దేశ అభివృద్ధికి వెన్నుముకగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలను నష్టాల్లోకి నెట్టి వాటి ప్రైవేటీకరణ దారుణమన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పరిశ్రమలు, భూములు ,సంపద జాతీయీకరణ జరగాలని ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ సంపదను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ధారా దత్తం చేయటం దారుణమన్నారు. ప్రైవేటీకరించడం అంటే రిజర్వేషన్లను తీసేయటమేనని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మతం మారినంత మాత్రాన వారిపై అణిచివేత, వివక్ష, అంటరానితనం తొలగిపోలేదనీ అభివృద్ధి శూన్యమని తెలిపారు.

1950సం.నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సామాజిక న్యాయానికి వ్యతిరేకమని వాటిన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుల నిర్మూలన పోరాటాలు వర్ధిల్లాలి , అమరహే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పేదలకు భూములు పంచాలి, రిజర్వేషన్ పరిరక్షించుకుందాం, అంటూ ర్యాలీ లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత విముక్తి కళాబృందం చైతన్య గీతాలతో హోరెత్తించారు.

మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు కె .రవి, నాస్తిక సమాజం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఎన్ బుద్ధ, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు శరత్, విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, నవయాన బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షుడు వై. నూకరాజు, ప్రముఖ బుద్ధిస్ట్ నటరాజ్ , బహుజన కళా మండలి ప్రధాన కార్యదర్శి ఆటవ భాస్కర్, నీలం రాజు, పి. భాస్కర్, దళిత విముక్తి ప్రతినిధులు బంకపల్లి అప్పారావు,బి .సన్యాసమ్మ, యు.శివ, ఎన్ . వరలక్ష్మీ, బోనెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story