Visakhapatnam: దసరా సెలవుల్లో ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచనలు
Visakhapatnam: దసరా సెలవుల్లో ఊరెళ్లే ప్రజలు ఇంటి భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని పీఎం పాలెం క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
Visakhapatnam: దసరా సెలవుల్లో ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచనలు
విశాఖపట్నం: దసరా పండుగ, సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రజలు ఇంటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం సిటీ పోలీస్, పీఎం పాలెం క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పగలు, రాత్రి వేళల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సెలవుల సమయంలో రెండు, మూడు రోజుల పాటు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాల్సి వస్తే, ముందుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. పోలీసులకు సమాచారం అందించిన ఇళ్లపై నిఘా ఉంచి, అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు.
ఇళ్లలో బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను ఉంచకుండా వీలైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు, వీలైన చోట్ల సీసీ కెమెరాలను అమర్చుకోవాలని పేర్కొన్నారు.
అలాగే, ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నట్లు ఫొటోలు, వీడియోలను వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయకూడదని హెచ్చరించారు. ఇళ్లలో ఎవరూ లేరనే విషయం నేరస్థులకు తెలిసే అవకాశం ఉన్నందున వ్యక్తిగత ప్రయాణ వివరాలను బహిరంగంగా వెల్లడించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
దసరా పండుగను సంతోషంగా జరుపుకుంటూనే ఇంటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, దొంగతనాల నివారణకు పోలీసులకు సహకరించాలని పీఎం పాలెం క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




