Anakapalli: అనకాపల్లి ప్రవేశ మార్గంలో జాతీయ జెండాను పునఃప్రతిష్ఠించాలి!

Anakapalli: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అనకాపల్లి ప్రవేశ మార్గంలో నిరాదరణకు గురైన జాతీయ జెండాను పునఃప్రతిష్ఠించాలి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Sept 2026 1:44 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి ప్రవేశ మార్గంలో జాతీయ జెండాను పునఃప్రతిష్ఠించాలి!

Anakapalli: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అనకాపల్లి పట్టణ ప్రవేశ మార్గంలో నిరాదరణకు గురైన భారత జాతీయ పతాకాన్ని తక్షణమే పునఃప్రతిష్ఠించాలని సిద్దార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత బల్లా నాగభూషణం అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు.

అనకాపల్లి పట్టణ ప్రతిష్ట, విశిష్టతలతో పాటు జాతీయ సమైక్యత, భారత జాతీయ జెండా గౌరవాన్ని చాటిచెప్పాలనే ఉద్దేశంతో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం జాతీయ రహదారి ప్రవేశ మార్గంలో ప్రతిష్టాత్మకంగా జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

అప్పటి జిల్లా కలెక్టర్ రవిపఠాన్ శెట్టితో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో సుమారు రూ.14 లక్షల ఆర్థిక సహాయ నిధులతో జాతీయ జెండా ఏర్పాటు, లైటింగ్ వ్యవస్థ, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.

అయితే గత రెండు సంవత్సరాలుగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను వినియోగంలో లేకుండా జెండా పోల్ చివర చుట్టి కట్టి ఉంచడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా లైటింగ్ వ్యవస్థ, పచ్చని మొక్కలు పూర్తిగా నిర్వీర్యం కావడంతో ఆ ప్రాంతం ప్రస్తుతం పిచ్చిమొక్కలు, తుప్పలతో నిండిపోయిందని తెలిపారు.

దీంతో ఆ ప్రదేశం అపరిశుభ్రంగా మారి, విషసర్పాలకు నిలయంగా మారడంతో పాటు మలమూత్ర విసర్జనకు కూడా ఉపయోగించే పరిస్థితి నెలకొందని బల్లా నాగభూషణం పేర్కొన్నారు. జాతీయ జెండాను ఏర్పాటు చేసిన ప్రాంతం ఇలాంటి దుస్థితికి చేరడం బాధాకరమని, ఇది జాతీయ పతాక గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా అయినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచి, నిరుపయోగంగా ఉన్న జాతీయ జెండాను పునఃప్రతిష్ఠించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండా గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సిద్దార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ తరఫున బల్లా నాగభూషణం కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story