Andhra University: ఏయూలో ఘనంగా తిలక్ 105వ జయంతి వేడుకలు!
Andhra University: ఆంధ్ర వర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో భావకవి తిలక్ 105వ జయంతి ఘనంగా జరిగింది. ఆచార్యులు ఆయన సాహిత్యాన్ని కొనియాడారు.
Andhra University: ఏయూలో ఘనంగా తిలక్ 105వ జయంతి వేడుకలు!
Andhra University: ప్రముఖ సాహితీవేత్త, భావకవి, అభ్యుదయ కవి, మానవతావాది దేవరకొండ బాలగంగాధర తిలక్ 105వ జయంతి వేడుకలు ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
తెలుగు శాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన సాహిత్య దర్శనం కార్యక్రమంలో తిలక్ చిత్రపటానికి శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ తిలక్ కవిత్వంలో అభ్యుదయం, మానవతావాదం, భావం, అనుభూతి సమ్మిళితమై ఉన్నాయని అన్నారు.
ఏకైక సిద్ధాంతానికి పరిమితం కాకుండా సామాన్య మానవుడిపై అభ్యుదయ దృష్టితో తిలక్ సాహిత్యాన్ని సృష్టించారని పేర్కొన్నారు. సమాజంలోని అన్యాయాలు, అక్రమాలను తన రచనల్లో స్పష్టంగా ప్రతిబింబించారని తెలిపారు.
ఆచార్య నల్లా సత్యనారాయణ మాట్లాడుతూ తిలక్ తన రచనల ద్వారా సమాజాన్ని, జాతిని మేల్కొలిపారని అన్నారు. ఆచార్య గజ్జా యోహాన్‌బాబు మాట్లాడుతూ తిలక్ రచనలు పోటీ పరీక్షలకూ ఉపయోగపడే స్థాయిలో ఉన్నాయని, ‘అమృతం కురిసిన రాత్రి’ విద్యార్థులు తప్పక చదవాల్సిన గ్రంథమని పేర్కొన్నారు.
శేఖర మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ తిలక్ కథలు, కవితలు, నాటకాల్లో మానవత్వమే ప్రధాన సందేశమని అన్నారు. డా. అన్నంశెట్టి ఈశ్వరమ్మ మాట్లాడుతూ తిలక్ కవిత్వంలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు.
ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ తిలక్ కవిత్వం, కథలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, లేఖల్లో విమర్శాత్మక దృక్పథం విస్తారంగా ఉందన్నారు. ఆయన రచనల్లో సౌందర్యంతో పాటు సామాజిక విషాదం, సమకాలీన పరిస్థితులపై విమర్శ కనిపిస్తాయని వివరించారు. డా. వెంకట సూర్యారావు మాట్లాడుతూ ‘అమృతం కురిసిన రాత్రి’ ఆధునిక తెలుగు సాహిత్యంలో విశిష్టమైన గ్రంథమని అన్నారు.
కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం. కృష్ణవేణి, డా. ఎం. దాసు, డా. బి. సూర్యనారాయణ, డా. ఎం. ప్రతాప్, డా. పి. శ్రీనివాసరావు, డా. ఎల్. గిరీష్‌కుమార్ పరిశోధక విద్యార్థి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు , డా. ఆర్. శివయ్య, పితాని ప్రసాద్, డా. కె.వి.ఎస్. మూర్తి, జి.ఎస్. శ్రీనివాసరావు, డా. మారదాన సుబ్బారావు, పరిశోధకులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. పి. ఇస్లాం ఆహ్వానం పలుకగా, ఎం. మౌనిక వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.




