చోడవరంలో దస్తావేజు లేఖర్ల ఆందోళన.. జీవో 396 రద్దు చేయాలని డిమాండ్!
అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు భారీ ఆందోళన చేపట్టారు.
చోడవరం (అనకాపల్లి): అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు వడ్డాది.రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వడ్డాది రమేష్ మాట్లాడుతూ దస్తావేజులేఖరు ల ఉపాధికే ముప్పుగా మారిన జీవో నెంబర్ 396 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రత్యామ్నాయ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ఆలోచనతో ఏళ్ల తరబడి దస్తావేజు లేఖరులుగా పని చేస్తున్న వేల కుటుంబాల పొట్ట కొట్టి, లక్షల మంది ఉపాధి పై ప్రభావం చూపే నిర్ణయాన్ని తీసుకుని వారి ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖను పి. పి.పి విధానంలో ప్రైవేటుపరం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ శాఖ అనేది మిగులుతోందా అని ప్రశ్నించారు.
మొదట మెడికల్ కాలేజీల్ని పిపిపి విధానం లోకి తీసుకువచ్చారు తర్వాత మున్సిపాలిటీలను తీసుకువచ్చారు ఇలా ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ప్రతి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటుపరం చేస్తే భవిష్యత్తులో తన యొక్క ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒకలా నిర్ణయాలు తీసుకోవడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని.. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తోని, దస్తావేజు లేఖర్లతోనే పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
2002వ సంవత్సరంలో టిడిపి ప్రభుత్వ సమయంలో దస్తావేజు లేఖరుల లైసెన్సులు రద్దుచేసి తీసుకున్న తప్పుడు నిర్ణయంతో 2004లో టిడిపిని గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు.
అదేవిధంగా 2004 నుంచి 2009 వరకు దస్తావేజులేఖర్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవడం వల్ల 2009లో కూడా మరల కాంగ్రెస్ గెలుపుకు రాష్ట్రవ్యాప్తంగా కృషి చేశామని తెలిపారు.
తర్వాత పరిణామాల్లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల సమయంలో రిజిస్ట్రేషన్ సెంటర్లను మీ సేవలకు ఇస్తామని ప్రకటించడంతో తదుపరి ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయారని. 2014 లో ఏర్పడిన టిడిపి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలకు ఫ్రంట్ డెస్క్లను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న నిర్ణయంతో తర్వాత 2019లో వైసీపీని గెలిపించామని, 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ శాఖను సచివాలయాలకు అప్పగిస్తామని అనాలోచితం నిర్ణయం ప్రకటించడం వలన 2024లో తిరిగి టిడిపికి పట్టం కట్టామని...ఇప్పుడు కూడా ఇలాంటి అనాలోచితం నిర్ణయం తీసుకుంటే లక్షల కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్నాయని ఎన్నికల ఫలితాలను మార్చే ఓటు బ్యాంకు తాము కూడా కలిగి ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తు ఎరగాలి అని తెలిపారు.
దస్తావేజు లేఖర్ల కుటుంబాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ముమ్మాటికి ఇది నిజమని తెలిపారు.... ప్రభుత్వం జీవో నెంబర్ 396 ను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు.




