Meghalakonda: వంజంగిలో బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యం: జిల్లా టూరిజం అధికారి చలపతిరావు

Meghalakonda: వంజంగి మేఘాలకొండ వద్ద పర్యాటకుల నుంచి అధిక వసూళ్ల ఆరోపణలపై జిల్లా టూరిజం అధికారి చలపతిరావు విచారణ జరిపారు. ప్లాస్టిక్ రహిత పర్యాటకానికి పిలుపునిచ్చారు.

SAI, PADERU
Published on: 12 Sept 2026 9:51 PM IST
Meghalakonda
X

Meghalakonda: వంజంగిలో బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యం: జిల్లా టూరిజం అధికారి చలపతిరావు

అల్లూరి సీతారామరాజు జిల్లా: మేఘలకొండ వంజంగి పర్యాటక కేంద్రాన్ని జిల్లా టూరిజం అధికారి శ్రీ పట్టాసి చలపతిరావు సందర్శించారు.

ఈ సందర్భంగా వంజంగి ప్రాంతంలోని వాహన డ్రైవర్లు, వాహన యజమానులు, హోటల్ మరియు ఇతర పర్యాటక సేవల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి బాధ్యతాయుత పర్యాటకంపై అవగాహన కల్పించారు.

వంజంగిలో పర్యాటకుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో స్థానికులతో క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపారు.

ఈ సందర్భంగా జిల్లా టూరిజం అధికారి మాట్లాడుతూ, పర్యాటకులకు అధిక ధరలతో ఇబ్బందులు కలగకుండా, అదే సమయంలో వాహనదారులు, హోటల్ నిర్వాహకులు, స్థానిక వ్యాపారులకు నష్టం కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో పర్యాటక వ్యాపారాన్ని నిర్వహించాలని సూచించారు. పర్యాటకులు సంతృప్తిగా ఉండేలా సేవలు అందించడం ద్వారా జిల్లాకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు.

ప్లాస్టిక్ రహిత పర్యాటకమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

రానున్న నెలలో పర్యాటక సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, జిల్లాలోని టూర్ ఆపరేటర్లు, వాహన యజమానులు, రెస్టారెంట్ నిర్వాహకులు, హోటల్ యాజమాన్యాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి టి. పూజశ్రీ, ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యాటకులకు అందుబాటులో ఉండేలా, సేవాదారులకు కూడా అనుకూలంగా ఉండే సహేతుకమైన ధరల నిర్ణయానికి ఈ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.

పర్యాటక సీజన్‌లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూ, జిల్లా ప్రతిష్ఠను మరింత పెంచేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా టూరిజం అధికారి కోరారు.

SAI, PADERU

SAI, PADERU