Ram Mohan Naidu: ఎర్రబస్సులు కాదు ఎయిర్‌ బస్సులు.. విమర్శకులకు రామ్మోహన్ నాయుడు పంచ్!

Ram Mohan Naidu: ఎర్రబస్సులు కాదు ఎయిర్‌బస్సులు తిరిగే ప్రాంతమని నిరూపించాం! భోగాపురం విమానాశ్రయం సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు.

Arun Chilukuri
Updated on: 1 Aug 2026 12:40 PM IST
Ram Mohan Naidu
X

Ram Mohan Naidu: ఎర్రబస్సులు కాదు ఎయిర్‌ బస్సులు.. విమర్శకులకు రామ్మోహన్ నాయుడు పంచ్!

Ram Mohan Naidu: ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు గర్వంగా చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని హేళన చేసిన వారికి ఈ విమానాశ్రయ ప్రారంభమే సముచిత సమాధానమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రాముఖ్యతను వివరిస్తూ రామ్మోహన్ నాయుడు భావోద్వేగంగా మాట్లాడారు. "గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం 'ఎర్రబస్సులు' మాత్రమే తిరిగే వెనుకబడిన ప్రాంతమని కొందరు హేళన చేశారు. ఇవాళ కళ్లు తెరిచి చూడండి.. ఎర్రబస్సులు మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి 'ఎయిర్ బస్సులు' ల్యాండ్ అయ్యే ప్రాంతంగా ఇది మారింది. ఉత్తరాంధ్రలో మునుపెన్నడూ లేని విధంగా ఊహించని అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది." అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతికి సింహద్వారంలా నిలుస్తుందని, దీనివల్ల వేలాది మంది ప్రాంతీయ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలోని 'విజన్ 2047', ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'వికసిత్ భారత్' సాధనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరడమేనని మంత్రి కొనియాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story