Chodavaram: అనకాపల్లి జిల్లాలో ఆధార్ కేంద్రాల అడ్డగోలు వసూళ్లు!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం పరిసర ప్రాంతాల్లోని ఆధార్ కేంద్రాల్లో నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 3 Sept 2026 2:18 PM IST
Chodavaram
X

Chodavaram: అనకాపల్లి జిల్లాలో ఆధార్ కేంద్రాల అడ్డగోలు వసూళ్లు!

Chodavaram: నిత్యజీవితంలో కీలకంగా మారిన ఆధార్కార్డులు జిల్లాలోని ఆయా కేంద్రాల నిర్వాహకులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుకు, ధ్రువపత్రాల జారీకి ఆధార్ను పరిగణనలోకి తీసుకోవడంతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏ అవసరానికైనా ఆధార్ తప్పనిసరిగా మారింది.

రేషన్కార్డు దారులకు ఈ-కేవైసీ కావాలన్నా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి కార్డుల జారీ, అప్డేట్ ఆవశ్యకత నేపథ్యంలో.. ఈ కేంద్రాల నిర్వాహకులకు కాసులు కురుస్తున్నాయి. నిర్దేశిత రుసుములకు మించి కొందరు ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నారు. ఉచితంగా అందించాల్సిన సేవలకు సైతం అందినకాడికి దండుకుంటున్నారు. ప్రశ్నిస్తే.. సాంకేతిక లోపాన్ని సాకుగా చూపడం, ఫలానా పత్రం తేవాలని, సర్వర్ బిజీ అంటూ మళ్లీ రావాలంటూ తిప్పి పంపిస్తున్న సంఘటనలు వినిపిస్తున్నాయి.

కేంద్రాల్లో రుసుములు సూచించే బోర్డులు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. జిల్లాలో సింహభాగం అమలు కావడంలేదు. చోడవరం మండలంలోని ఓ ఆధార్ కేంద్రంలో ఇటీవల ఎనిమిది నెలల పసిబాబుకు మొదటి ఆధార్కార్డు నమోదుకు ఉచితంగా చేయాల్సి ఉండగా.. రూ.150 డిమాండ్ చేశారు. రసీదు ఇవ్వమని సదరు వ్యక్తి నిలదీయడంతో రూ.100తో సరిపుచ్చారు.

బుచ్చయ్యపేట మండలానికి చెందిన ఓ మహిళ ఆర్టీసీ ఉచిత ప్రయాణం నిమిత్తం తన ఆధార్కార్డులోని కొన్ని వివరాల సవరణకు బుచ్చయ్యపేట కేంద్రానికి వెళ్లగా.. సదరు నిర్వాహకులు రూ.150 వసూలు చేశారు.

ఇదీ పరిస్థితి..

తొలిసారి ఆధార్ నమోదు (వయసుతో సంబంధం లేకుండా) కు ఎలాంటి రుసుము లేదు. కానీ కొందరు రూ.100-200 వరకు వసూలు చేస్తున్నారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, చరవాణి నెంబరు.. వీటిలో ఏదైనా ఒకటి, అంతకుమించి అప్డేట్ చేయాలంటే రూ.75 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రూ.100-150 వరకు తీసుకుంటున్నారు. రేషన్కార్డు లబ్ధిదారులు గత ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉంది. కుటుంబసభ్యులందరీ బయోమెట్రిక్ అప్ డేట్ కావాలి.

లేని వారంతా కేంద్రాల వద్దకు పరుగులు పెట్టిన సంఘటనలు చూశాం. అవసరాన్ని అవకాశంగా మలుచుకున్న నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

పర్యవేక్షణ లేక..

జిల్లా లోని గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని రూ.75 బదులు రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. అనువుగా ఉంటుందని పీవీసీ కార్డు పేరిట మరో రూ.100 తీసుకుంటున్నట్లుగానూ తెలుస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపం వారికి మరింత కలిసి వస్తుందనే వాదన వినిపిస్తుంది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story