Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి: మంత్రి
Visakhapatnam: రూ.34 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను అనుసంధానించే భీమిలి-నర్సీపట్నం 4 లైన్ల రహదారి విస్తరణ పనులను ఆర్&బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి: మంత్రి
విశాఖ/భీమిలి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే కీలకమైన భీమిలి - నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులను మంత్రి నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజలకు మెరుగైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రూ. 34 కోట్ల వ్యయంతో ప్రస్తుతం ఉన్న భీమిలి- - నర్సీపట్నం 2 లైన్ల రహదారిని 4 లైన్ల రహదారిగా విస్తరించేందుకు అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు.
ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ. 1.66 కోట్ల వ్యయంతో 7.34 శాతం పనులు పూర్తయినట్లు సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. రహదారి నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్లను, అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి, మిగిలిన పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్ & బి శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.




