Anakapalli: సర్పంచ్ టికెట్ల కోసం హోరాహోరీ.. గెలుపు గుర్రాల వేటలో కూటమి!

Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. సర్పంచ్ టికెట్ల కోసం ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, కూటమి నేతలు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Nov 2026 7:10 AM IST
Anakapalli
X

Anakapalli: సర్పంచ్ టికెట్ల కోసం హోరాహోరీ.. గెలుపు గుర్రాల వేటలో కూటమి!

Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అనకాపల్లి, కసింకోట మండలాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ టికెట్ కోసం ఆశావాహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం భారీ సంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే టికెట్ల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా, క్షేత్రస్థాయిలో ప్రజాబలం, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పీల గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జనసేన పార్టీ అనకాపల్లి ఇన్చార్జి భీమరశెట్టి రామ్కీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

గత కార్పొరేటర్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చి కూటమి తమ సత్తా చాటిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, అభ్యర్థుల బలాబలాలు.. ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.

మొత్తానికి సర్పంచ్ ఎన్నికలంటే ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే స్థాయిలో రాజకీయ వేడి కనిపిస్తోంది. మరి టికెట్ దక్కించుకునేది ఎవరు? బరిలో నిలిచేది ఎవరు? కూటమి గెలుపు గుర్రాలుగా ఎవరిని ఎంపిక చేస్తుంది? అనేది ఇప్పుడు అనకాపల్లి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI