Anakapalli: విదేశీయులకు ఆశ్రయమిస్తే ఫారం-సి తప్పనిసరి: ఎస్పీ తుహిన్ సిన్హా
Anakapalli: అనకాపల్లి జిల్లాలో విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, విద్యాసంస్థలు 24 గంటల్లో ఫారం-సి ద్వారా వివరాలు నమోదు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.
Anakapalli: విదేశీయులకు ఆశ్రయమిస్తే ఫారం-సి తప్పనిసరి: ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరిధిలో విదేశీయులకు వసతి లేదా ఆశ్రయం కల్పించే యాజమాన్యాలు, వ్యక్తులు తప్పనిసరిగా వారి రాక, నిష్క్రమణ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఆదేశాలు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం, ఉపాధి లేదా వ్యక్తిగత అవసరాల కోసం జిల్లాకు వచ్చే విదేశీయులకు బస కల్పించే హోటళ్లు, రిసార్టులు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోమ్‌స్టేలు, Airbnbలు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, PGలు, ప్రైవేట్ అద్దె ఇళ్లు వంటి వసతి కేంద్రాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు.
అదేవిధంగా ఆసుపత్రులు, వైద్య చికిత్సా కేంద్రాలు, విద్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు, మఠాలు, ఆశ్రమాలు, మదర్సాలు, కాన్వెంట్లు తదితర సంస్థలు కూడా విదేశీయులకు వసతి కల్పిస్తే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
24 గంటల్లో ఫారం-సి నమోదు
విదేశీయులు వసతి కేంద్రానికి చేరుకున్న సమయం నుంచి 24 గంటల్లోగా Form-III / Form-C ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. వారు అక్కడి నుంచి వెళ్లిపోయినప్పుడు వారి నిష్క్రమణ వివరాలను కూడా పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
అతిథులకు సంబంధించిన రికార్డులను సంబంధిత యాజమాన్యాలు కనీసం ఒక సంవత్సరం పాటు భద్రపరచాలని పోలీసులు సూచించారు. విదేశీయులతో పాటు OCI కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశస్థులు బస చేసినా వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
విదేశీయుల వివరాలను నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు.
వ్యక్తులు, ప్రైవేట్ లేదా వాణిజ్యేతర వసతి నిర్వాహకులకు రూ.50 వేల నుంచి జరిమానాతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లకు రూ.లక్ష నుంచి జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
చెల్లుబాటు అయ్యే వీసా, పాస్‌పోర్ట్ లేకుండా విదేశీయులకు ఆశ్రయం కల్పించడం లేదా నకిలీ పత్రాలకు సహకరించడం వంటి సందర్భాల్లో 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
విదేశీయులు కూడా నిబంధనలు పాటించాలి
భారతదేశ చట్టాలను గౌరవించాలని, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండకూడదని పోలీసులు సూచించారు. సరైన వీసా అనుమతులు లేకుండా ఉద్యోగాలు లేదా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. చిరునామా మారితే సంబంధిత FRRO అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అనుమానాస్పదంగా ఉంటే 112కు సమాచారం
జాతీయ భద్రత దృష్ట్యా తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా నివసిస్తున్న విదేశీయులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విదేశీయులకు వసతి కల్పించే ప్రతి యాజమాన్యం, వ్యక్తి చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా పోలీస్ కార్యాలయం స్పష్టం చేసింది.




