Visakhapatnam: విశాఖ మేయర్ పీఠం కూటమిదే: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు!

Visakhapatnam: విశాఖ జీవీఎంసీ మేయర్ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 26 Aug 2026 8:33 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ మేయర్ పీఠం కూటమిదే: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు!

Visakhapatnam: విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడిని అభిమానిస్తారని, 2019 లో రాష్ట్రమంతా వైసీపీ హవా నడిచినప్పటికీ విశాఖలోని నాలుగు దిక్కులు ఆయన వెంట నడిచాయన్నారు.

గత ఎన్నికల్లో గాజువాక, భీమిలి, పెందుర్తి అసెంబ్లీ స్థానాల నుంచి రాష్ట్రంలో మొదటి, రెండు, నాలుగవ అత్యధిక మెజారిటీలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఐటీ, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాల్లో విశాఖను శరవేగంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు.

జీవీఎంసీలో విలీనానికి అనుకూలంగా భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తున్నారని చెబుతూ.. ఇంతకుముందే భీమిలి నియోజకవర్గానికి చెందిన 3 మండలాల్లో ఇదే నిర్ణయాన్ని లేఖ రూపంలో ఇచ్చామని పేర్కొన్నారు.

భోగాపురం మండలాన్ని జీవీఎంసీలో కలపాలన్న ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ ఈ విషయమై నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి నాయకులతో చర్చించి తన నిర్ణయం చెబుతానని గతంలో చెప్పారన్నారు. భోగాపురం జీవీఎంసీలో కలిస్తే బాగుంటుందనేది వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

తన తనయుడు గంటా రవితేజ మేయర్ రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా.. నేను పోటీ చేయవద్దా? అని సరదాగా వ్యాఖ్యానించారు. అభ్యర్థి ఎంపికకు ఇంకా చాలా సమయముందని, అధిష్టానం నిర్ణయం శిరోధార్యమన్నారు.

ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి డేటా సెంటర్ల ప్రతిపాదనలు వచ్చినా అంగీకరించేది లేదని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలియజేశారు. డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్తు కోసం ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story