Visakhapatnam: స్థానిక ఎన్నికల్లో గీత కులాలకు 20% సీట్లు కేటాయించాలి!
Visakhapatnam: స్థానిక సంస్థల ఎన్నికల్లో గీత కులాలకు 20% సీట్లు కేటాయించాలి. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు ₹10 లక్షల పరిహారం ఇవ్వాలని ఐక్య వేదిక డిమాండ్.
Visakhapatnam: స్థానిక ఎన్నికల్లో గీత కులాలకు 20% సీట్లు కేటాయించాలి!
Visakhapatnam: రాష్ట్రవ్యాప్తంగా సామాజికంగా, రాజకీయంగా బలమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్న గీత కులాలైన శెట్టిబలిజ,యాత,గౌడ,ఈడిగ,శ్రీ శయన సామాజిక వర్గం విశాఖ జిల్లాలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని 'గీత కులాల ఐక్య వేదిక' ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలో పౌరగ్రంధాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గీత కులాల ఐక్య వేదిక అధ్యక్షులు సంపంగి శ్రీనివాస్, కార్యదర్శి అప్పారి గిరిబాబు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67 లక్షల జనాభాతో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న గీత కులాలు, విశాఖపట్నం నగరంలోనే దాదాపు 3 లక్షల సంఖ్యలో ఉన్నారని వారు తెలిపారు. అయితే రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని, ఎన్నికల అనంతరం విస్మరిస్తున్నాయని ఆరోపించారు.
బినామీల చేతుల్లో కేటాయింపులు:
టిడిపి ప్రభుత్వం గీత కులాల ఆర్థికాభివృద్ధి కోసం మద్యం షాపులు, బార్ల కేటాయింపులో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవోకు వారు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ నిర్ణయ ఫలితాలు క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులకు అందడం లేదని, బడా వ్యాపారులు, బినామీలే ఈ కేటాయింపులను నడుపుతూ గీత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం డిమాండ్
త్వరలో జరగనున్న జివిఎంసి (GVMC), జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC), పంచాయతీ ఎన్నికలలో తమ జనాభా ప్రాతిపదికన స్థానిక ప్రాతినిధ్యం కల్పించాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. తమతో సమాన జనాభా ఉన్న ఇతర సామాజిక వర్గాలకు 20 శాతం వరకు టికెట్లు కేటాయిస్తున్నారని, అదే రీతిలో గీత కులాలకు కూడా తగిన అవకాశాలు ఇచ్చి తమ ఉనికిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
గీత కార్మికులకు తక్షణమే ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
తాటి, ఈత చెట్లపై నుంచి పడి ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు గతంలో అమలైన విధంగా ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పెండింగ్‌లో పడిన పరిహారం బకాయిల వల్ల సుమారు 300 బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని, వారికి వెంటనే ఈ సాయాన్ని విడుదల చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా గీత కార్మికులకు 45 సంవత్సరాల వయస్సు నుంచే సామాజిక పింఛను మంజూరు చేయాలని కోరారు.ప్రమాదాల నివారణకు గాను అత్యాధునిక రక్షణ బెల్టులు, మోటారైజ్డ్ రోప్ కార్ట్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయాలని, ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందిన వారికి ఆర్థిక భద్రతతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నీరా ప్రొడక్ట్స్ కి అనుమతి ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న నీరా ప్రొడక్ట్స్ అమ్మకాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా గీత సామాజిక వర్గం వారు అమ్ముకునే విధంగా జీవో తీసుకురావాలని, నీరా ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి యాతలకు,శ్రీశయన గీత కులాలకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ గీత కులాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు గొడ్డి కన్నారావు, వై. మధు గౌడ్, బమ్మిడి రమణ తులసి పార్వతి,నెల్లి రాజు, ఎల్లమెల్లి సురేష్, పట్నాల నూకరాజు, కొప్పిశెట్టి కనక శేఖర్, కముజు రమణ, చెల్లుబోయిన గోవిందు తదితరులు పాల్గొన్నారు




