Simhachalam: సింహాచలంలో వైభవంగా ఉట్ల ఉత్సవం, తిరువీధి సేవ!

Simhachalam: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్ల ఉత్సవం, వేణుగోపాలస్వామి సేవ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 7:41 AM IST
Simhachalam
X

Simhachalam: సింహాచలంలో వైభవంగా ఉట్ల ఉత్సవం, తిరువీధి సేవ!

Simhachalam: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో శనివారం ఉట్ల ఉత్సవం, వేణుగోపాలస్వామి వారి తిరువీధి సేవ అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణుడి బాల్యలీలలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ ఉత్సవంతో సింహగిరి భక్తి పారవశ్యంతో పులకించింది.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, ఆలయ ఇంచార్జ్ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు శ్రీ గోడపర్తి శ్రీనివాసాచార్యులు, శ్రీ కర్రీ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించింది.

రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ యాదవ వంశానికి చెందిన భక్తునిచే ఉట్టిని కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఉట్టిని లాగుతూ, భక్తుల హర్షధ్వానాల మధ్య సంప్రదాయబద్ధంగా ఉట్ల ఉత్సవాన్ని జరిపించారు.

“గోవిందా.. గోపాలా.. శ్రీకృష్ణా..” అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. ఉట్ల ఉత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ శ్రీకృష్ణుడి బాల్యలీలలను స్మరించుకున్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాలకృష్ణుల వేషధారణలో ఆలయానికి విచ్చేసిన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్ని కృష్ణుల వేషధారణలో చిన్నారులు చేసిన సందడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు బాలకృష్ణ వేషధారణలో వచ్చిన చిన్నారులకు బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం చిన్నారులకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చిన్నారులతో ముచ్చటిస్తూ వారిని ఆశీర్వదించి, శ్రీకృష్ణుడి కృప ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఉట్ల ఉత్సవం అనంతరం ఉత్సవమూర్తులను సుందరంగా వేణుగోపాలస్వామి అలంకరణలో ముస్తాబు చేసి పల్లకిపై అధిష్టింపజేశారు. అర్చకులు, రుత్వికులు, వేద పండితుల వేదమంత్ర ఘోషలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సాయంత్రం సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు.

స్వామివారి తిరువీధికి ముందు నిర్వహించిన కోలాటాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేదమంత్ర ఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల హరినామస్మరణలతో సింహాచల మాడవీధులు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి.

వేణుగోపాలస్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు పరవశించి, స్వామివారి కృపకు పాత్రులైన అనుభూతిని పొందారు.

ఈ ఉత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు దంపతులు, ధర్మకర్తలు కరకదేముడు, మధుపడ సన్యాసిరావు, నీటిపల్లి మహేష్, ఉషశ్రీ తదితరులు స్వామివారి ఆశీస్సులు పొందారు.

దేవస్థానం ఏవోలు, పర్యవేక్షణ అధికారులు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, ఇంజనీరింగ్ అధికారులు,ఆలయ ఉద్యోగులు, దేవస్థానం మొత్తం సిబ్బంది,అర్చకులు, రుత్వికులు, వేద పండితులు, నాదస్వర కళాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉట్ల ఉత్సవం, బాలకృష్ణుల సందడి, తిరువీధి సేవతో సింహగిరి మొత్తం ఆనందోత్సవంగా మారింది. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది భక్తులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని, ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకున్నారు.

చిన్నారుల కేరింతలు, భక్తుల హర్షధ్వానాలు, హరినామస్మరణలతో సింహాచల క్షేత్రం ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయింది.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి దివ్యదర్శనం, ఉట్ల ఉత్సవం, బాలకృష్ణుల వేషధారణ, వేణుగోపాలస్వామి వారి తిరువీధి సేవను తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి, శ్రీకృష్ణుని కృప తమ కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.

శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యాన్ని తలపించేలా సాగిన ఈ ఉత్సవం సింహాచల క్షేత్రంలో భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మేళనంగా నిలిచింది.

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం

సింహాచల క్షేత్రంలో వైభవంగా కళావేదికపై కనువిందు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి., భక్తుల జయజయధ్వానాలతో సింహగిరి ఆధ్యాత్మిక శోభతో పునీతమైంది.

​ భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లోత్సవాన్ని విజయవంతం చేశారు.

సాయంత్రం స్వామివారి దేవస్థానం కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సింహగిరి భక్తజనులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. సాయంత్రం 5:00 గంటల నుండి 7:00 గంటల వరకు గుడివాడకు చెందిన ప్రఖ్యాత "శ్రీ శివ జ్యోతి నృత్యాలయ" బృందం వారిచే ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధులను చేసింది.

​స్వామివారి వైభవం, లీలలను ప్రతిబింబించే కీర్తనలకు కళాకారులు చేసిన లయబద్ధమైన పాదవిన్యాసాలు, భావయుక్తమైన అభినయాలు భక్తులను పరవశింపజేశాయి. కళాకారుల ప్రతిభకు ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది.

​ఈ సాంస్కృతిక సాయంత్రం అనంతరం అద్భుతమైన ప్రదర్శనతో అలరించిన నృత్య కళాకారులను, నిర్వాహకులను దేవస్థాన అధికారులు, సత్కరించి, శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story