Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలన!

Visakhapatnam: విశాఖపట్నం జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.

SHIVA, BHIMILI
Published on: 8 Oct 2026 7:00 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలన!

Visakhapatnam: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) రెండో సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలకు తావులేకుండా ముందస్తు కార్యాచరణను పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని పలు విభాగాల భవనాలు, బ్లాకులు, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

జీవీఎంసీ ఈస్ట్, సౌత్ జోన్లకు సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల (Election Material Distribution Centres) ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను కమిషనర్ పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ కౌంటర్లు, మైక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, పోలీస్ కౌంటర్, వాహనాల పార్కింగ్ , ఫుడ్ కౌంటర్లు తదితర ఏర్పాట్లను ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎన్నికల అనంతరం జీవీఎంసీలోని అన్ని జోన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు వీలుగా కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుపై కమిషనర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఇంజనీరింగ్ కాలేజ్ న్యూ క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ బ్లాక్ తదితర భవనాలను అధికారులతో కలిసి పరిశీలించారు.

అన్ని జోన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఆయా భవనాల్లో అందుబాటులో ఉన్న గదులు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సిబ్బంది, ఎన్నికల ఏజెంట్ల రాకపోకలకు అవసరమైన సదుపాయాలను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన రిసెప్షన్ కౌంటర్లు, స్ట్రాంగ్ రూములు, ఫుడ్ కౌంటర్లు, పార్కింగ్ తదితర సదుపాయాలను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా, తగిన వెలుతురు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రాంగణమంతా పూర్తిస్థాయిలో వెలుతురు ఉండేలా అవసరమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి తరలింపు, భద్రపరచడం, కౌంటింగ్ ప్రక్రియ సమయంలో అధికారులు, సిబ్బంది, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే గుర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను ఎన్నికల నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలకు అవకాశం లేకుండా ప్రతి అంశానికి సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అదనపు కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు.

ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి దయానిధితో కమిషనర్ పలు అంశాలను చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కార్యాచరణను వేగవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, విభాగాల వారీగా బాధ్యతలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు కె. రమేష్, డి.వి. రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మ, పి.ఎం. సత్యవేణి, పి. నల్లనయ్య, ప్రధాన ఇంజనీరు పి.వి.వి. సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్లు కె. శివప్రసాద్, ఎం. మల్లయ్య నాయుడు, చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఏసీపీలు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI