Visakhapatnam: కూటమిపై ప్రజల నమ్మకానికి నిదర్శనం: గంటా

Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొని, మేయర్ ముక్కా శ్రావణికి శుభాకాంక్షలు తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 3 Nov 2026 10:55 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: కూటమిపై ప్రజల నమ్మకానికి నిదర్శనం: గంటా

విశాఖపట్నం: ప్రజల ఆశలు, ఆకాంక్షలకు జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉందని మరోసారి నిరూపితమైందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పోలింగ్ శాతం తక్కువైనా.. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారన్నారు. యువ మేయర్ గా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ముక్కా శ్రావణి విశాఖను విశ్వ నగరంగా అభివృద్ధి చేయడంలో కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. 2019 లో వైసీపీ గాలిలో సైతం టీడీపీ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ స్థానాలను గెలిచి విశాఖలోకి ఆ పార్టీని రానివ్వలేదని గుర్తు చేశారు.

జీవీఎంసీ పరిధిలోని గాజువాక, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మెజారిటీ సాధించి 1, 2, 4 స్థానాల్లో నిలిచాయన్నారు. అదే ఫలితాన్ని తిరగరాసిన మేయర్ అభ్యర్థి శ్రావణికి.. కార్పొరేటర్ అభ్యర్థులకు, కూటమి శ్రేణులకు గంటా అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మరోసారి పట్టం కట్టిన విశాఖ ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.