Chintoor: చింతూరు ఏజెన్సీలో గోవుల మాఫియా రాజ్యం!
Chintoor: చింతూరు ఏజెన్సీ అడవుల మాటున గోవుల అక్రమ రవాణా మాఫియా రెచ్చిపోతోంది.
Chintoor: చింతూరు ఏజెన్సీలో గోవుల మాఫియా రాజ్యం!
Chintoor: చింతూరు ఏజెన్సీలో గోవుల అక్రమ రవాణా ఇప్పుడు ఓ వ్యవస్థీకృత దందాగా మారిపోయింది. ఒడిశా రాష్ట్రంలో అక్రమార్కులు గోవులను తక్కువ ధరకు కొనుగోలు చేసి అడవి, సీలేరు నది మార్గాల గుండా ఆంధ్రాలోని కొత్తపల్లి, వేములరాయి, నేలకోట గ్రామాలకు చేరుస్తారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
పగటి పూట ఆవులను రోడ్డు మార్గంలో మెల్లగా తోలుకుంటూ వచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా ఓ సీక్రెట్ ప్లేస్‌లో దాచిపెడతారు. అడవి మధ్యలో, నిర్మానుష్య ప్రాంతంలో ఉండే ఆ స్థావరానికి చుట్టుపక్కల కాపలా ఉంటుంది. స్థానికంగా కొందరు వ్యక్తులు ఈ దందాకు కళ్లు, చెవులుగా మారారు.
రాత్రి 8 గంటలు దాటిందంటే చాలు లారీలు, కంటైనర్లు, వ్యాన్లు ఒక్కొక్కటిగా ఆ సీక్రెట్ ప్లేస్‌కు చేరుకుంటాయి. లైట్లు ఆర్పేసి, శబ్దం రాకుండా వందలాది ఆవులను వాహనాల్లో కుక్కేస్తారు. ఒక్కో లారీలో 30 నుంచి 40 ఆవుల వరకు ఇరుకుగా ఎక్కించి, తెల్లవారకముందే సుదూర ప్రాంతాలకు తరలించేస్తారు.
ఈ దందా వెనుక స్థానికులు, చింతూరులోని పలువురు వ్యక్తులతో పాటు గోకవరం ప్రాంతానికి చెందిన వ్యక్తుల హస్తం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్రిప్‌కు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని, నెలకు కోట్లలో వ్యాపారం సాగుతోందని ప్రచారం జరుగుతోంది.
ఆశ్చర్యం ఏంటంటే.. నిత్యం ఇంత పెద్ద ఎత్తున గోవుల తరలింపు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చెక్‌పోస్టులు ఉన్నా, పెట్రోలింగ్ ఉన్నా మాఫియా కళ్లకు గంతలు కట్టేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోవులను కాపాడాల్సిన గోశాలలు మూతపడుతుంటే కబేళాలకు వెళ్లే లారీలు మాత్రం రాత్రికి రాత్రే పరుగులు పెడుతున్నాయి. ఈ మాఫియా భరతం పట్టాలంటే ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి, రాత్రిపూట ఆకస్మిక తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే చింతూరు ఏజెన్సీ గోవుల మాఫియాకు అడ్డాగా మారిపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




