Parawada: పరవాడలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా!

Parawada: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కన్నూరు రాజరాజేశ్వరి చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 24 Jun 2026 6:52 PM IST
Parawada
X

Parawada: పరవాడలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా!

పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కన్నూరు పంచాయతీ పరిధిలో ఉన్న రాజరాజేశ్వరి చెరువులో మట్టిదొంగలు చెలరేగిపోతున్నారు. మట్టిదొంగలను అడ్డుకొనే వారు లేకపోవడంతో లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడ్తున్నారు. చెరువులు, కొండలను కొల్లగొడ్తూ స్థానిక వీఆర్వో మట్టి మాఫీయాను పెంచుతున్నాడు. ‘తిలా పాపం తలో పిడికెడు’ అన్న చందంగా నాయకులకు మట్టివాటాలు గుట్టుగా పంచుతున్నాడు.

దీంతో మట్టితిన్న పాముల్లా స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు నాయకులు మొద్దు నిద్రను నటిస్తున్నారు. దీంతో రాజరాజేశ్వరి చెరువు దోపిడికి గురవుతుంది. ఫార్మాసిటీతో పాటు వివిధ కంపెనీలు, భవన నిర్మాణ పనులకు గ్రావెల్‌ అవసరమవుతుంది. అయితే డిమాండ్‌కు సరిపడా గనులకు మైన్స్‌ శాఖ పరవాడ మండలంలో అనుమతులు ఇవ్వక పోవడంతో మట్టిదొంగలు రెచ్చిపోతున్నారు. గతంలో ఓ నిజాయితీ అధికారీ విజిలెన్స్‌ ఎడిగా ఉన్న కాలంలో మట్టిదొంగలు చాలావరకూ తమ వ్యాపారాలను పక్కనబెట్టి ఇతర కార్యకలాపాల వైపు మళ్లారు.

అయితే ఇప్పుడు ఆయన పదిలీపై వెళ్లిపోవడంతో మట్టి దొంగలు మళ్లీ గ్రావెల్‌ దందాలకు తెరతీశారు. కన్నూరు పంచాయతీలోని రాజరాజేశ్వరి చెరువును కొంతమంది అక్రమార్కులు స్థానిక వీఆర్వో అండదండలతో అనాధికారికంగా తవ్వేస్తున్నారు. చెరువులో మట్టిని తవ్వాలంటే నీటిపారుదలశాఖ అనుమతులతో పాటు గ్రావెల్‌ రవాణాకు మైన్స్‌ శాఖ అనుమతులు తప్పని సరి. రాజరాజేశ్వరి చెరువును అనధికారికంగా, ఇష్టారాజ్యాంగా తవ్వేస్తూ మైనర్‌ మినరల్‌ గ్రావెల్‌ను తరలిస్తున్నారు.

గ్రావెల్‌ అక్రమ తరలింపుతో మినరల్‌ సెస్‌ ప్రభుత్వం నష్టపోతుంది. ఈ మొత్తాలు గ్రావెల్‌ మాఫియా జేబుల్లోకి చెరిపోతుంది. సెలవు రోజుల్లోనూ, రాత్రి వేళల్లోనూ మట్టిదొంగలు రెచ్చిపోతున్నారు. అక్రమ మార్గంలో మట్టి లంకెలపాలెం, ఫార్మాసిటీ, ఇతర కంపెనీలకు తరలిపోతుంది. వీరికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాకెందుకులే అనుకొని మామూళ్ల మత్తులో పడి మొద్దునిద్ర నటిస్తున్నారు.

దీనిపై మైన్స్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించి మట్టి దొంగలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు అక్రమ గ్రావెల్‌ తరలింపుకు వినియోగిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు ఎవ్వరూ చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులకు సంబంధిత అధికారుల అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు కన్నూరు పంచాయతీలోని రాజరాజేశ్వరి చెరువు లో జరుగుతున్న మట్టి మాఫియా పై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story