Anakapalli: అనకాపల్లి కూటమి సమావేశంలో ఆసక్తికరంగా మారిన నాయకుడి పేర్లు!

Anakapalli: అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను అభిమానులు చిన్నాయన అని, జనసైనికులు పెద్దాయన అని పిలుస్తుండటంపై కూటమి సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Sept 2026 1:10 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి కూటమి సమావేశంలో ఆసక్తికరంగా మారిన నాయకుడి పేర్లు!

Anakapalli: అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకప్పుడు ఆయనను “చిన్నాయన” అని పిలిచిన అభిమానులు, ఇప్పుడు “పెద్దాయన” అని సంబోధిస్తుండటం కూటమి ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆసక్తికరంగా మారింది.

1989 నుంచి కొణతాల రామకృష్ణ వెంట నడిచిన నాయకులు, అభిమానులు, అనుచరులు ఆయనను ఆప్యాయంగా “చిన్నాయన” అని పిలుచుకునేవారు. అయితే కాలం మారింది.. రాజకీయ పరిణామాలు మారాయి.. ఇప్పుడు జనసైనికులు మాత్రం కొణతాల రామకృష్ణను “పెద్దాయన”గా సంబోధిస్తున్నారు.

ఇటీవల జరిగిన కూటమి ఆత్మీయ సమావేశంలో ఈ పేర్లపై సరదాగా ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొణతాల అభిమానులు సమావేశం వద్దకు వచ్చిన జనసైనికులను కలిసి “చిన్నాయన వచ్చారా?” అని అడిగారు. దీంతో కొంతమంది జనసైనికులు “చిన్నాయన ఎవరు?” అంటూ ఆశ్చర్యపోయారు.

అప్పుడు కొణతాల అభిమానులు.. “చిన్నాయన అంటే కొణతాల రామకృష్ణ గారు వచ్చారా అని అడుగుతున్నాం” అని వివరించారు. దీంతో జనసైనికులు నవ్వుతూ.. “మేమంతా ఎమ్మెల్యే గారిని పెద్దాయన అని పిలుస్తాం.. చిన్నాయన అని అడగడంతో కాసేపు అయోమయానికి గురయ్యాం” అంటూ తమలో తాము సరదాగా ముచ్చటించుకున్నట్లు సమాచారం.

దీంతో ఒకప్పుడు తమ అభిమాన నాయకుడిని “చిన్నాయన”గా పిలిచిన వారు.. ఇప్పుడు ఆయనను “పెద్దాయన”గా పిలుస్తున్న జనసైనికుల మాటలను ఆసక్తిగా గమనించారు.

కాలం మారితే పిలుపు మారుతుంది.. కానీ అభిమానం మాత్రం మారదనేలా ఈ చిన్న సరదా సంఘటన కూటమి సమావేశంలో ఆసక్తిని రేకెత్తించింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI