Visakhapatnam: విశాఖ సీబీసీఎన్‌సీ భూముల్లో వేల కోట్ల కుంభకోణం: జనసేన సంచలన ఆరోపణలు!
Visakhapatnam: విశాఖపట్నంలోని కోట్ల విలువైన సిబీసిఎన్ సీ (CBCNC) భూముల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారంటూ జనసేన తీవ్ర ఆరోపణలు చేసింది.
Visakhapatnam: విశాఖ సీబీసీఎన్‌సీ భూముల్లో వేల కోట్ల కుంభకోణం: జనసేన సంచలన ఆరోపణలు!
విశాఖలో వేల కోట్ల విలువైన క్రైస్తవ మత సంస్థ సిబీసిఎన్ సీ భూమి వివాదాలకు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులే సూత్రధారులుగా రోజురోజుకు నిర్ధారణ అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుత టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత అప్పట్లో విశాఖ చీఫ్ సిటీ ప్లానర్ గా వందల కోట్ల అక్రమాలకు పాల్పడటంతో పాటు 100 కోట్ల విలువైన సాంఘిక సంక్షేమ శాఖ స్థలాన్ని మాయం చేసేశారు.
సీబీసీఎన్ సీ స్థలాన్ని పూర్తిగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి సాంఘిక సంక్షేమ శాఖ స్థలాన్ని పరిరక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థలం కనిపించకుండా పోవడానికి కారణమైన విద్యుల్లత ను తక్షణమే విడుదల నుంచి డిస్మిస్ చేసి ఆమె కారణంగా జరిగిన వందల కోట్ల నష్టాన్ని రికవరీ చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
సాంఘిక సంక్షేమ శాఖ స్థలం ఎక్కడ?
సిబిసిఎన్ సీ భూముల్లో దశాబ్దాలు గా మహిళల హాస్టల్ నడుస్తోంది. అది ఆ తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ పరమైంది. ఈ స్థలంలో యూనియన్ చాపెల్ చర్చి పక్కన చాలా కాలం ఒక భవనంలో హాస్టల్ నడిచింది. విశాఖ వాసులందరికీ అది తెలిసిందే.
అయితే విచిత్రంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత ఆ హాస్టల్ స్థలం పశ్చిమ నుంచి తూర్పుకు మారిపోయింది. కేవలం బిల్డర్ ప్రయోజనాల కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా ఆ స్థలాన్ని మార్చేసి బిల్డర్ కు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చారు.
కోర్టు డాక్యుమెంట్లలో స్పష్టం
2012 వ సంవత్సరంలో అప్పటి జీవీఎంసీ కమిషనర్ ప్రస్తుత ప్రత్తిపాడు శాసనసభ్యుడు రామాంజనేయులు సి బి సి ఎన్ సి స్థలంలో పశ్చిమ భాగాన హాస్టల్ ఉందని జిల్లా కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో సర్వే మ్యాపు తో సహా సమర్పించారు. డోర్ నెంబర్ 10-1-7 లో మహిళా హాస్టల్ ఉందని దాన్ని కొనుగోలు చేయలేదని సిబిసిఎన్ సి స్థల యజమానులుగా చెబుతున్న మాలిని త్యాగరాజన్, రత్నాకర్ హెగ్డేలు కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. తాము 10-1-6 లో ఉన్న స్థలాన్ని మాత్రమే తాము కొనుగోలు చేశామని కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు హాస్టల్ స్థలం విద్యుల్లత నేతృత్వంలోని టౌన్ ప్లానింగ్ అధికారుల మాయాజాలంతో అదృశ్యం అయిపోయింది.
ఎంవివి సత్యనారాయణ ప్రయోజనాల కోసమే
సి బి సి ఎన్ సి స్థలానికి పశ్చిమ దిక్కున యూనియన్ ఛాపల్ చర్చి పక్కన సాంఘిక సంక్షేమ భవనాన్ని చూపిస్తే ఎం వివి సత్యనారాయణ కట్టే భవనం ఆకృతి దెబ్బతింటుంది. ఇందుకోసం పశ్చిమాన ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ స్థలాన్ని కబ్జా చేశారు.
దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ కు లిఖితపూర్వకంగా నేనే ఫిర్యాదు చేయడంతో హడావుడిగా తూర్పు భాగాన సాంఘిక సంక్షేమ శాఖ స్థలం ఉందని కొంత భూమిని చూపించారు. అదే స్థలానికి అప్పటి జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ నేతృత్వంలో ప్రహరీ నిర్మించి బోర్డు పెట్టారు.
డాక్యుమెంట్లలో ఎక్కడా కనిపించని ప్రభుత్వ స్థలం
అయితే విచిత్రంగా మాజీ ఎంపీ ఎం వివి సత్యనారాయణ ఈ స్థలంలో నిర్మిస్తున్న ఎంవీవీ పీక్ బహుళ అంతస్తుల భవనం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ లో ఎక్కడ సరిహద్దుగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ స్థలాన్ని చూపించడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ కూడా గుడ్డిగా ఆయన చెప్పిన సరిహద్దులను గుర్తిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తోంది. రికార్డుల ప్రకారం అయితే భవనానికి పశ్చిమాన సాంఘిక సంక్షేమ శాఖ మహిళా హాస్టల్ స్థలం ఉండాలి.
విచిత్రంగా ఎంవివి సంస్థ యూనియన్ చేపల్ చర్చిని సరిహద్దుగా చూపిస్తోంది. కనీసం అప్పటి జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్న తూర్పు నైనా సరిహద్దుగా హాస్టల్ స్థలాన్ని చూపించాలి. అలా చూపకుండా రహదారిగా దానిని రిజిస్ట్రేషన్ లలో పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు ఎందుకు దీనిని అంగీకరిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సోషల్ వెల్ఫేర్ టి డి ఆర్ కూడా కొట్టేశారు
నిజానికి సోషల్ వెల్ఫేర్ విభాగం స్థలం సి బి సి ఎన్ సి కి తూర్పు భాగాన ఉన్నా, పశ్చిమాన ఉన్నా కోట్ల రూపాయల్లో టిడిఆర్ వస్తుంది. ఆశీలమెట్ట సిరిపురం ట్రావెలర్స్ బంగ్లా రహదారి కి ఆనుకొని ఈ స్థలం ఉంది. విద్యుల్లత నేతృత్వంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహంతో సాంఘిక సంక్షేమ శాఖ స్థలాన్ని పూర్తిగా విస్మరించి ఈ స్థలానికి సంబంధించిన టిడిఆర్ ను కూడా కలిపేసి మొత్తం 63 కోట్ల విలువైన టిడిఆర్ బాండ్లను దినకర్ త్యాగరాజన్ కే ఇచ్చేశారు.
కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత టి డి ఆర్ లో కొంత భాగాన్ని ఆ స్థలానికి మంజూరు చేయాలి. ఇక్కడ అలా జరగలేదు. అంటే సాంఘిక సంక్షేమ శాఖ స్థలానికి దక్కాల్సిన టి డి ఆర్ ని కూడా ఎంవివి సత్యనారాయణకు గుడ్డిగా అధికారులు ఇచ్చేశారు. ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు.
ఇటీవల సంబంధిత తహసీల్దార్ సర్వే అధికారులు ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం కేవలం 10 డాక్యుమెంట్లకే టి డి ఆర్ వస్తుంది. అయితే 18 డాక్యుమెంట్లకు జీపీఎ గా పొందిన దినకర్ త్యాగరాజన్ కు టిడిఆర్ ఇచ్చేశారు. ఇందులో ఎనిమిదింటికి నిబంధనల మేరకు టిడిఆర్ రానే రాదు. నోటరైజడ్ అఫిడవిట్ మీద దినకర్ త్యాగరాజన్ కు టిడిఆర్ ఇవ్వడం కూడా నిబంధన ఉల్లంఘన అవుతుంది.
సర్వం విద్యుల్లతే
సి బి సి ఎన్ సి భూముల్లో జరుగుతున్న అక్రమ టిడిఆర్లు, అక్రమ నిర్మాణాలకు కర్త, కర్మ, క్రియ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత కావటం గమనార్హం. గత వైసిపి ప్రభుత్వం లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన హామీని టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు దృష్టిలో ఉంచుకొని నిబంధనల మేరకు సి బి సి ఎన్ సి ప్లాను ను రద్దు చేయాల్సిందిగా జనసేన తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడలో విద్యుల్లత నేతృత్వంలోనే 128 కోట్ల అక్రమ టి డి ఆర్ సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం కు మంజూరు అయింది .అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అంటూ విద్యుల్లత పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే విజిలెన్స్ విభాగం ఇటీవల నివేదికను సమర్పించింది.
ఆ టి డి ఆర్ లని కూడా దినకర్ త్యాగరాజని పేరిట కొనుగోలు చేసినట్లు చూపించి ఈ ఎంవీవీ పిక్ భవనానికే వినియోగించారు. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ప్రయోజనం చేకూర్చేందుకే విద్యుల్లత ఈ అక్రమాలు అన్నింటికీ పాల్పడ్డారు అన్నది స్పష్టమైంది. ఈ వాస్తవాలు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఆమెను విధులు నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్.




