Anakapalli: అనకాపల్లి జనసేనలో జోష్.. వారం రోజుల్లో 2,200 దరఖాస్తులు!
Anakapalli: జనసేన పార్టీ చేపట్టిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యక్రమం వారం రోజుల పాటు విజయవంతంగా ముగిసిందని అబ్జర్వర్ పెండెం దొరబాబు తెలిపారు.
Anakapalli: అనకాపల్లి జనసేనలో జోష్.. వారం రోజుల్లో 2,200 దరఖాస్తులు!
అనకాపల్లి: పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ చేపట్టిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యక్రమం వారం రోజుల పాటు విజయవంతంగా నిర్వహించి ముగించినట్లు కమిటీ అబ్జర్వర్ పెండెం దొరబాబు తెలిపారు.
ఆదివారం అనకాపల్లిలోని విజయ రెసిడెన్షియల్‌లో నిర్వహించిన ముగింపు సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఎలాంటి ప్రలోభాలు, సిఫార్సులకు తావు లేకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావమైన 2014 నుంచి సేవలందిస్తున్న ప్రతి కార్యకర్తకు వారి అర్హత, సేవలను ఆధారంగా చేసుకుని పార్టీలో తగిన గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు.
జూన్ 29 నుంచి జూలై 5 వరకు ఏడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక స్పందన లభించిందని తెలిపారు. జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐదు రోజుల్లోనే సుమారు 2,200 దరఖాస్తులను సమర్పించినట్లు వెల్లడించారు.
ఈ సమాచార సేకరణ కమిటీలో 21 మంది సభ్యులతో పాటు ముగ్గురు సీనియర్ నాయకులు, ముగ్గురు సీనియర్ సాధకులు, తాను కలిపి మొత్తం 28 మంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు దొరబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం కమిటీ సభ్యులు పెండెం దొరబాబును శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.




