Gajuwaka: గాజువాకలో కుటుంబ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి
Gajuwaka: గాజువాక సీఎమ్మార్ సెంట్రల్ వద్ద కుటుంబ వివాదంతో నర్సింగరావుపై కత్తితో దాడి జరిగింది. బాధితుడు ఆర్కే ఆసుపత్రిలో చేరగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Gajuwaka: గాజువాకలో కుటుంబ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి
గాజువాక: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని CMR సెంట్రల్ సమీపంలో కుటుంబ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, గొడ్డువానిపాలెం, పెద్దగంట్యాడకు చెందిన నర్సింగరావు అలియాస్ చిరంజీవి (35) తన నానమ్మ గత నెల 30వ తేదీన మరణించడంతో అంత్యక్రియల కార్యక్రమాలకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో విజయవాడలో నివసిస్తున్న అతని మేనత్త బత్తిన సత్యవతి తన రెండో భర్త తాటికొండ నాగరాజు, ఆమె కుమారులు బత్తిన దుర్గాప్రసాద్ అలియాస్ నాని, బత్తిన జగన్ అలియాస్ బాబీతో కలిసి ఈరోజు దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేనత్త రెండో భర్త అయిన నాగరాజును దినకర్మ కార్యక్రమానికి తీసుకురావద్దని గతంలోనే చెప్పినప్పటికీ, ఎందుకు తీసుకువచ్చారని నర్సింగరావు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. అక్కడున్న వారు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం మేనత్త సత్యవతి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు తిరిగి వెళ్లేందుకు గాజువాక మీదుగా వెళ్తుండగా, CMR సెంట్రల్ వద్ద పాఠశాల నుంచి తన కుమారులను తీసుకెళ్లేందుకు వచ్చిన నర్సింగరావును తాటికొండ నాగరాజు కత్తితో కుడివైపు ఛాతీ భాగంలో పొడిచి గాయపరిచినట్లు, అలాగే అతని కుమారులు చేతులతో దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గాయపడిన నర్సింగరావు ప్రస్తుతం RK ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




