Simhachalam: సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి!

Simhachalam: విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి (డ్రెస్ కోడ్) అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఇఓ జల్లేపల్లి వెంకట్రావు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 7 Nov 2026 7:16 AM IST
Simhachalam
X

Simhachalam: సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి!

Simhachalam: సింహాచలం క్షేత్ర పవిత్రత, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకునే భక్తులందరికీ సాంప్రదాయ దుస్తుల నియమావళిని (డ్రెస్ కోడ్) అమలు చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

మన సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయాలు మరియు దైవ సన్నిధి పట్ల భక్తి ప్రపత్తులను ప్రతిబింబించేలా భక్తులు ఆలయ మర్యాదలను గౌరవించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ క్రింది విధంగా నిర్దేశించిన వస్త్రధారణ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు.

సాధారణ దర్శనాలకు వస్త్రధారణ నిబంధనలు:

పురుషులకు: ధోతీతో పాటు అంగవస్త్రం, కుర్తా–పైజామా లేదా సంప్రదాయబద్ధమైన ఫార్మల్ షర్ట్ మరియు ప్యాంట్ ధరించి ఆలయంలోనికి ప్రవేశించవచ్చు. మహిళలకు: చీర, లంగావోణీ (హాఫ్ శారీ) లేదా దుపట్టాతో కూడిన చుడీదార్‌లను మాత్రమే అనుమతిస్తారు.

నిషేధిత దుస్తులు: షార్ట్స్ (నిక్కర్లు), టీ-షర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్, మోడ్రన్ వెస్ట్రన్ దుస్తులు ధరించి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక నిబంధనలు శ్రీ స్వామివారి నిత్య కల్యాణం, తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే పురుష భక్తులు తప్పనిసరిగా ధోతీ–అంగవస్త్రం లేదా సాంప్రదాయ కుర్తా–పైజామా ధరించాలి.

ఆర్జిత సేవల్లో పాల్గొనే మహిళా భక్తులు చీర, లంగావోణీ లేదా తప్పనిసరిగా దుపట్టా ధరించిన చుడీదార్‌లతో మాత్రమే సేవలకు హాజరుకావలసి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలని, పెద్ద పిల్లలు దేవస్థానం నిర్దేశించిన నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు.

దేవస్థానం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని, ఆలయ పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్క భక్తుడూ భాగస్వామ్యం కావాలని, సిబ్బందికి మరియు భద్రతా విభాగాలకు పూర్తిస్థాయిలో సహకరించాలని దేవస్థాన ఇఓ జల్లేపల్లి వెంకట్రావు కోరారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.