Visakhapatnam: వైజాగ్ లో ఫుడ్ మాఫియాకు చెక్.. వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ ప్రారంభం!
Visakhapatnam: విశాఖపట్నంలో కల్తీ ఆహార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ డిమాండ్ చేసింది.
Visakhapatnam: వైజాగ్ లో ఫుడ్ మాఫియాకు చెక్.. వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ ప్రారంభం!
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో కల్తీ, కలుషిత ఆహార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణమూర్తి ఈరోజు జిల్లా ఆహార భద్రత అధికారి ఎస్ కళ్యాణ్ చక్రవర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేటి బసవ కృష్ణమూర్తి మాట్లాడుతూ నగరంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, తోపుడు బండ్లు, విద్యాసంస్థల హాస్టల్ మెస్‌లలో కల్తీ నూనెలు, ఎక్స్‌పైరీ అయిన పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, పురుగు పట్టిన కూరగాయలు వినియోగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఫుడ్ పాయిజనింగ్, కామెర్లు, టైఫాయిడ్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 అమలులో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల కల్తీ వ్యాపారులు నిర్భయంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
నగరంలోని అన్ని ఆహార విక్రయ కేంద్రాల్లో ప్రతి నెలా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్-ఫ్రీ నంబర్, వాట్సాప్ కంప్లైంట్ వ్యవస్థ ఏర్పాటు చేసి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా స్పాట్‌లోనే నమూనాలు పరీక్షించాలని ఆయన కోరారు. కల్తీకి పాల్పడినట్లు రుజువైతే వెంటనే లైసెన్స్ రద్దు చేసి భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మూసివేసిన దుకాణాల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఆహార విక్రయ కేంద్రం వద్ద ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ హైజీన్ రేటింగ్ బోర్డును తప్పనిసరి చేయడంతో పాటు విద్యార్థులు, మహిళా సంఘాలు, హోటల్ యజమానులకు “ఈట్ రైట్ ఇండియా” క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా ఆహార భద్రత అధికారి సానుకూలంగా స్పందిస్తూ వారం రోజుల్లో నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ డ్రైవ్ ప్రారంభిస్తామని, ఇచ్చారు. విశాఖను కల్తీ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.




