Anakapalli: పాయకరావుపేటలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన!
Anakapalli: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటి విడుదల, సీఎం చంద్రబాబు జలహారతి కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు అనిత, నిమ్మల, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు.
Anakapalli: పాయకరావుపేటలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన!
అనకాపల్లి పాయకరావుపేట: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకువచ్చే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పాయకరావుపేట వేదిక కానుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా సెప్టెంబర్ 2న నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలను చారిత్రాత్మక ఘట్టంగా ప్రభుత్వం భావిస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మంగళవారం జలహారతి నిర్వహించనున్న ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
జలహారతి కార్యక్రమంతో పాటు నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై మంత్రి వంగలపూడి అనిత పలు సూచనలు చేశారు. వేలాది మంది రైతులు, ప్రజలు కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు.
ఏర్పాట్ల పరిశీలనలో స్థానిక శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యం మాన్ పటేల్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మొత్తంగా.. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చే కీలక కార్యక్రమానికి పాయకరావుపేట వేదికగా నిలవనుండటంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.




